రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న...వివిధ మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై నిన్న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ తొలి భేటీ జరిగింది. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించిన జగన్..ఇంటెలిజెంట్ సెజ్, అదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. పరిశ్రమలు కోరుతున్న రాయితీలు....ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు ద్వారా రెండు దశల్లో 700 కోట్ల పెట్టుబడితో పాటు సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇదే సంస్థ కడప జిల్లాలోనూ మరో సెజ్ ఏర్పాటుచేసి, 2వేల మందికి ఉపాధి కల్పించనుంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రై లిమిటెడ్ హైవే టైర్ల తయారీ సంస్థ 980 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 2వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. విశాఖలోని మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ బిజినెస్ పార్కు..,రిక్రియేషన్ సెంటర్‌తో పాటు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం14 వేల 634 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా సుమారు 24 వేల 990 మందికి ఉపాధి లభించనుంది.