ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan review : ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలు: సీఎం జగన్​ - ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలు

CM Jagan review : ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను మరింత పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత చేయాలన్నారు. కొవిడ్‌ పైనా సమీక్షించిన సీఎం.. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM Jagan
CM Jagan

By

Published : Jul 13, 2022, 5:36 PM IST

CM Jagan review : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ద్వారా 2,446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తుండగా.. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ : ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం..దశల వారీగా అమలు చేయాలని ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి చేర్చి అక్కడనుంచి ఆస్పత్రికి చెల్లింపులు చేయాలన్నారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నారు. ధృవీకరణ పత్రంలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు... అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు తెలియజేయాలని సీఎం నిర్దేశించారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా, లేక పూర్తిగా ఉచితంగా వైద్యం అందిందా అన్న విషయాలనూ ధృవీకరించేలా పత్రం ఉండాలన్నారు. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేస్తే ధృవీకరణ పత్రంలో ఫిర్యాదుల కోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రోగి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి : రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మీద విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సీఎం సూచించారు. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. 108, 104 సేవలు మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాహనాలపై ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉంచాలని సీఎం సూచించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపైనా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా కరోనా కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పంగా ఉందన్నారు. ప్రస్తుతం కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైన వయసున్న వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

జులై చివరి నాటికి నియామకాలు పూర్తి చేయాలి : ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపైనా సీఎం సమీక్షించారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 40,476 పోస్టులను భర్తీ చేశామని అధికారులు తెలిపారు. జులై చివరి నాటికల్లా సిబ్బంది మిగిలిన నియామకాలు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడుపైనా సీఎం సమీక్షించారు. 16 మెడికల్‌ కాలేజీల్లో 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details