రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, మంత్రి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఏపీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ సిటీకి త్వరగా చేరుకునేలా బీచ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
మూడు పోర్టులు రెండున్నర ఏళ్లలో
పోలవరం నుంచి విశాఖకు పైపు లైను ద్వారా తాగు నీటి సరఫరా ప్రాధాన్యతా అంశమన్న సీఎం... ఈ పైపులైన్‌కు త్వరగా డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులు పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 8 ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఫిబ్రవరిలో టెండర్లు!
రామాయపట్నం పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు, రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వెల్లడించారు. భావనపాడు పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు...మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం కల్పిస్తామన్నారు.