కొవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హాట్ స్పాట్లలో ర్యాండమ్ సర్వేపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విశాఖలో నిర్వహించిన పద్ధతిలో సర్వేలు జరగాలని సూచించారు. క్వారంటైన్లు, క్యాంపుల్లో సదుపాయాలు, వసతుల పెంపుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాల్లో కొవిడ్ ఆస్పత్రుల్లోని పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తుండాలని చెప్పారు.
కొవిడ్ పై చర్చ అనంతరం వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ పై సీఎం సమీక్షించారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ చేపట్టామని అధికారులు వెల్లడించారు. అకాల వర్షాలు, ప్రభావాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నష్టపోయిన రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.