జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటిరోలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2016లో నమోదు చేసిన కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విన్నపంతో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ షమీమ్ అక్తర్ విచారించారు. 2016లో ఈడీ ప్రత్యేక కోర్టు హోదా ఉన్న ఎంఎస్‌జే కోర్టులో ఈడీ.. జగతి పబ్లికేషన్స్‌తోపాటు హెటిరో, అరబిందోలపై ఫిర్యాదు (అభియోగపత్రాల)ను దాఖలు చేసింది. కాలక్రమంలో సీబీఐ కోర్టుకూ ఈడీ కేసుల విచారణకు అనుమతిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు హోదాను కేంద్రం కల్పించింది.
ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ ఫిర్యాదును సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు. హెటిరో, అరబిందోల కేసు విచారణ ఎంఎస్‌జే కోర్టులోనే కొనసాగుతోంది. సీబీఐ నమోదు చేసిన కేసులతోపాటు వాటి ఆధారంగా ఈడీ నమోదు చేసిన (ఈసీఐఆర్), సీబీఐ ఎఫ్‌ఆర్‌లు సీబీఐ కోర్టులోనే ఉన్నందున ఈ కేసు విచారణను ఉపసంహరించుకుని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఎంఎస్‌జే కోర్టును హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు అందకపోవడంతో ఎంఎస్‌జే కోర్టు ఈ కేసుపై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.