ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

schools reopen: ఆగస్టు 16 నుంచి బడులు... అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం! - సీఎం జగన్ సమీక్ష

విద్యా శాఖ, అంగన్‌వాడీల్లో నాడు - నేడుపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ఆగస్టు 16 నుంచి పునః ప్రారంభించాలని, అప్పటిలోగా అంతా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నూతన విద్యావిధానం విధివిధానాలను అదే రోజు ప్రకటించాలని చెప్పారు. అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుందని తెలిపారు.

CM Jagan
CM Jagan

By

Published : Jul 24, 2021, 7:05 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ఆగస్టు 16 నుంచి పునః ప్రారంభించాలని, అప్పటిలోగా అంతా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నూతన విద్యావిధానం విధివిధానాలను అదే రోజు ప్రకటించాలని చెప్పారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ, ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంటే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఫౌండేషన్‌ బడుల్లో భాగంగా అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. అంగన్‌వాడీలు శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా మారుతాయని, వీటికి ఫౌండేషన్‌ స్కూళ్లు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు.

శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాల ప్రతి ఆవాసంలోనూ ఉంటుందని, కిలోమీటరు లోపే ఫౌండేషన్‌ బడి ఏర్పాటవుతుందని వివరించారు. మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నత పాఠశాల ఉంటుందని చెప్పారు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటుచేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఒక్క బడినీ మూసేయబోమని, ఎవ్వరినీ తొలగించబోమని ప్రకటించారు. మొదటి విడత నాడు-నేడు కింద రూపుదిద్దిన పాఠశాలలను ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేస్తామని, అదేరోజు రెండోవిడత నాడు-నేడు పనులు, విద్యాకానుక ప్రారంభిస్తామన్నారు. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు.

200 మందికి ఒకే ఉపాధ్యాయుడు

  • ప్రస్తుతం కొన్నిచోట్ల 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. మరికొన్ని చోట్ల నలుగురు విద్యార్థులకు ఒకరు బోధిస్తున్నారు. ఐదో తరగతి వరకూ ప్రతి ఉపాధ్యాయుడూ 18 సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇంటర్‌ తర్వాత డీఈడీ చేసి ఎస్జీటీలుగా పనిచేస్తున్నారు. నూతన విద్యావిధానం ద్వారా ఈ పరిస్థితుల్లో మార్పులు తెస్తాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు వస్తారు.
  • కొత్త విధానంలో 12వ తరగతి వరకూ ఆరు రకాల పాఠశాలలు ఉంటాయి. ఐదో తరగతి వరకూ 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ పూర్తిచేసిన నైపుణ్యమున్న ఉపాధ్యాయులే బోధిస్తారు. తద్వారా చిన్నారులకు నిశిత శిక్షణ ఉంటుంది.ఉపాధ్యాయుల్ని సమర్థంగా వినియోగించుకోవడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యం.

రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం..

  • నాడు-నేడు, నూతన విద్యావిధానం కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటి ద్వారా సాధించే లక్ష్యాలను అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నూతన విద్యావిధానం వైపు ఎందుకు వెళ్తున్నామో.. అర్థమయ్యేలా చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావుండకూడదు.
  • అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి పదోన్నతి ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి టీచర్‌ ఉండేలా హేతుబద్ధీకరణ జరగాలి.
  • విద్యార్థుల భవిష్యత్తు, సమాజ శ్రేయస్సు కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా అవినీతి, వివక్షకు తావుండకూడదు. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో ఖర్చుచేసిన ప్రభుత్వం గతంలో లేదు. నాడు-నేడు పనులు పారదర్శకంగా ముందుకు సాగాలి.

2020 పదో తరగతి విద్యార్థులకూ మార్కులు

తేడాది(2020) పదో తరగతి విద్యార్థులకూ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే పదోతరగతి విద్యార్థుల్ని ఉత్తీర్ణుల్ని చేశామని, కొన్ని ప్రవేశాల్లో మార్కులను పరిగణనలోకి తీసుకోవడంతో ఉద్యోగాల విషయంలో ఇబ్బంది పడుతున్నారని సీఎంకు వివరించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. మూడు ఫార్మెటివ్‌ పరీక్షలు 50శాతం, సమ్మెటివ్‌ 50శాతం తీసుకొని వందశాతానికి మార్కులు కేటాయిస్తారు. ఈ ఏడాది 2020-21కు ఇప్పటికే ఫార్మెటివ్‌ పరీక్షలు రెండు నిర్వహించినందున వీటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

ఇదీ చదవండి:

ap inter results 2021: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..

ABOUT THE AUTHOR

...view details