మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలు లేవనెత్తారు. ట్రైబల్ ఏరియాలో ప్రత్యేక వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐటిడిఎ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నారు. సాలూరులో ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు జగన్.
'గిరిజన ప్రాంతాల్లో వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటు చేయాలి' - cm jagan
ట్రైబల్ ఏరియాలో ప్రత్యేక వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద సమస్యపై ఏర్పాటు చేసిన సమావేశానికి జగన్ హాజరయ్యారు.
హస్తినలో వామపక్ష తీవ్రవాద సమస్యపై ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు సూచనలు చేశారు. రూ.50 లక్షల వరకు జరిగే పనులను స్థానికులకే ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. రూ.5 లక్షల పరిధిని 50 లక్షలకు పెంచుతున్నట్లు సమాచారం. అన్ని విషయాలు చర్చించడం సీఎంలకు సాధ్యం కాదన్న అమిత్‌షా...నక్సల్స్ ప్రాంతాల అభివృద్ధిపై సీఎస్‌లు దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో టవర్లు, బ్యాంకులు, తపాలాసేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అభివృద్ధి తప్ప మరో అంశానికి తావు ఉండకూడదని హోంమంత్రి సూచించారు. అవకాశం ఉన్న ప్రతిచోటా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చే నగదు బదిలీ పథకాలను అందరూ సులువుగా వాడుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయం నిత్యం జరగాలని, తాను కూడా స్వయంగా పాలుపంచుకుంటానని చెప్పిన అమిత్ షా....సంబంధిత విభాగాల్లో ఎక్కడా పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నక్సల్స్ నిర్మూలన చర్యలు చేపట్టడంలో సఫలీకృతం అయ్యాయని సమావేశం ప్రారంభంలో హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు...అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు గురించి ఆలోచన వద్దని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.