అమెరికాలో జస్టిస్ ఎన్వీ రమణ CJI Justice NV Ramana: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లెపూలదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని.. ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
తెలుగులోనే మాట్లాడాలి : తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవిస్తున్నామని.. మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని తెలిపారు. అమ్మ భాషలోని తియ్యదనం అనుభవించాల్సిందే.. మాటల్లో చెప్పలేమన్నారు. ఇంట్లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలన్న సీజేఐ.. మన భాష, సంస్కృతి మరచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందన్నారు. మాతృభాషలో ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనన్న ఆయన.. తాను మాతృభాషలో చదివి ఈ స్థాయికి వచ్చాననేది మరచిపోవద్దని అన్నారు.
జాషువా, దాశరథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారు. తెలుగు సంస్కృతిని, కళారంగాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్ శతజయంతి ప్రారంభమైంది. ఎన్టీఆర్, ఘంటశాల ఉచ్ఛారణ మా తరానికి అలవడింది. ఎన్టీఆర్, ఘంటశాలకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా -సీజేఐ, జస్టిస్ ఎన్వీ రమణ
వారి సంఖ్య పెరిగింది :అమెరికాలో 2010-2017 మధ్య తెలుగు మాట్లాడేవారి సంఖ్య 85 శాతం పెరిగిందని.. మాతృభూమిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటు అందిస్తున్నారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
అమెరికా వచ్చాక ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండవచ్చు. సమాజంలో అసమానతలు, అశాంతి తొలగించాల్సిన అవసరం ఉంది. ఎంత సంపాదించినా సమాజంలో అరాచకశక్తి ఉంటే ప్రశాంతంగా బతకలేం. సమాజంలో అనేక మతాలు, ప్రాంతాలకు చెందిన సముదాయం ఉంటుంది. మనమందరం ఐకమత్యంతో ఉండి అందరికీ గౌరవం ఇవ్వాలి. తమిళ సంస్కృతిని గౌరవించాలని నన్ను వచ్చి అడిగారు. తమిళులు భాష, సంస్కృతి కోసం ఐక్యతగా పోరాడతారు. సమాజంలో అన్ని తరగతుల ప్రజలను సమానంగా గౌరవించాలి -సీజేఐ, జస్టిస్ ఎన్వీ రమణ
రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా : తెలుగువాడిగా సీజేఐ అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చిందన్న జస్టిస్ ఎన్వీ రమణ.. తాను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చానని, తమ కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టమన్న ఆయన.. పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నందునే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రపతిని లేదా చిన్న ఉద్యోగిని కలిసినా నా ప్రవర్తనలో మార్పు ఉండదు. ఆడంబరాలు నన్ను ప్రభావితం చేయవు. ప్రజా క్షేమమే పరమావధిగా సత్వర న్యాయం అందాలి. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నన్ను అడిగారు. న్యాయ సమీక్ష చేసే అధికారం.. భారత దేశ న్యాయవ్యవస్థకు ఉంది. ఎవరైనా జడ్జి పదవి చేపట్టాక న్యాయాన్ని నిలబెట్టేలా ప్రవర్తిస్తారు. రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తిచేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం చరిత్ర. -సీజేఐ, జస్టిస్ ఎన్వీ రమణ
ఇవీ చూడండి: