దేవుడి తరువాత మనం చెతులేత్తి దండం పెట్టేది వైద్యులకే. కానీ అలాంటి పవిత్రమైన వైద్య వృతికే మాయని మచ్చగా మారుతోంది విశాఖలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. అభాగ్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ.. నిలువునా దండుకుంటుంది. ఒక్కొక్క నిర్వాకానికి ఒక్కో లెక్క ఉంటుంది. పురిటి నొప్పులు తగ్గక ముందే తల్లిని బిడ్డని వేరు చేస్తారు...అసలు పుట్టింది ఆడ బిడ్డా...మగ బిడ్డా అనే విషయం కూడా నవమాసాలు మోసిన తల్లికి కూడా తెలియకుండా చేసేస్తారు. కేవలం పిల్లలను విక్రయించడానికే మాత్రం.. అక్కడ పురుడు పోస్తారా అనే అనుమానం కలుగుతోంది.
పక్కా ప్రణాళికతోనే దందా..!
విశాఖ జిల్లా వి. మాడుగులకు చెందిన సుందరమ్మ విషయంలో సృష్టి ఆసుపత్రి వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. పేదరికంలో ఉన్నా... ఇద్దరు ఆడపిల్లలను సాకుతూ కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలోనే సుందరమ్మ మూడో కాన్పుకు గర్భం దాల్చింది. సరిగ్గా ఇదే అదునుగా భావించి...ఆమె పేదరికాన్ని ఆసరా చేసుకోవడానికి తెరవెనుక రంగం సిద్ధమైంది. అందులో భాగంగా ఇద్దరు ఆశ కార్యకర్తలతో చేతులు కలిపారు సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు. సుందరమ్మను చేరదీసి...ఆమెకు పుట్టబోయే బిడ్డను విక్రయించేలా పావులు కదిపారు. పథకం ప్రకారం సుందరమ్మను విశాఖలోని తమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ముందస్తు ప్రసవం అయ్యే విధంగా మందులు ఇచ్చారు. ఆపరేషన్ చేసిన వైద్యులు...పుట్టిన బిడ్డను కోల్కతాకు చెందిన దంపతులకు విక్రయించేశారు.
సుందరమ్మను అలా పంపించేశారు...
సుందరమ్మకు పుట్టిన బిడ్డను విక్రయించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంది ఆస్పత్రి యాజమాన్యం. తన రక్తాన్ని చమురుగా చేసి ప్రాణవాయువుని పోసిన సుందరమ్మను కొద్దిసేపట్లోనే ఆస్పత్రి నుంచి పంపించేశారు. ఆ సమయంలో ఆమెకు ఇచ్చింది కేవలం.. అర బస్తా బియ్యం, కేజీ కందిపప్పు, ఒక్క డబ్బా నూనె మాత్రమే. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఆశా కార్యకర్తలకు లక్షకు పైగానే డబ్బులు ముట్టాయి.