తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే అందుకు పోలీసులు సహకారం అందించడం తగదని హితవు పలికారు. వైకాపా నేతలు.. తమ ప్రతీకారేచ్ఛకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.
పోలీస్ బాస్‌గా పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే నియంత రాజకీయాలకు చికిత్స అని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు తగ్గట్టే ఉన్నాయన్నారు. ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరించాలని కోరారు.
బలహీనవర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయని... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నమోదు చేసిన కేసులు కుట్రలో భాగమేనన్నారు. వైద్యులు సుధాకర్, అనితారాణిల ఘటన లో పోలీసుల తీరు ప్రజలంతా చూశారని విమర్శించారు.