తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు సంఘీభావం తెలపాలని శ్రేణులకు సూచించారు. గతంలో అమరావతికి కట్టుబడి ఉంటామని అసెంబ్లీలో ప్రకటన చేసిన జగన్... ఇవాళ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని తెదేపా డిమాండ్ చేస్తే అధికార వైకాపా ముందుకు రాలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల అభివృద్ధిని కొనసాగించాలే తప్ప... నాశనం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి మీదో, పార్టీ మీదో, వ్యవస్థ మీద కక్షతో సమాజాన్ని నాశనం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు సహించరని చెప్పారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం మొండితనం మాని.. మూడు ముక్కలాట చర్యలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కరోనా నియంత్రణపై వైకాపా ప్రభుత్వానికి శ్రద్ద లేదని విమర్శించారు. రోజుకు 10వేల కేసులు, 100మంది వరకు చనిపోతున్నా స్పందన లేదని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కన్నా ప్రత్యర్ధులపై కక్ష సాధించడమే ప్రభుత్వానికి ప్రాధాన్యమా అని నిలదీశారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యుల్ని వేధించే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచం అంతా వైద్యుల సేవలకు నీరాజనాలు పలుకుతుంటే రాష్ట్రంలో మాత్రం వైద్యులను వేధించడం అమానుషని ధ్వజమెత్తారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ రావుపై, చిత్తూరులో అనితారాణిపై అమానుషాలు, విజయవాడలో డా.రమేష్ బాబుపై వేధింపులను ప్రజలంతా ఖండించాలన్నారు. ప్రతి పథకంలో అవినీతి ఉందన్న చంద్రబాబు... స్కీముల ముసుగులో స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.