రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతోందని, వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏడాదిలో రూ.80 వేల కోట్ల అప్పులు చేసిందని.. అదీ చాలక ప్రజలపై రూ.50 వేల కోట్ల పన్నుల భారం వేసిందని మండిపడ్డారు. ఆస్తులు అమ్మినా కూడా అభివృద్ధి శూన్యమేనని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఏమైంది? తెలంగాణతోనూ, కేంద్రంతోనూ ఉన్న సమస్యలు ఎన్ని పరిష్కరించారని ఆయన నిలదీశారు. ‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఎలా మనుగడ సాగిస్తుందో తెలియని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేసి, తెదేపాపై నెపం వేస్తోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం తెదేపా మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండటం.. కార్మిక, కర్షక వర్గాల సంక్షేమం వంటి పార్టీ మూల సిద్ధాంతాల్ని ఎవరూ విస్మరించరాదని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మర్చిపోవాలని, భవిష్యత్తులో అలా జరగకుండా వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం కోసం, పార్టీ కోసం మళ్లీ కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.
‘దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోని వెనుకబడినవర్గాలకు.. తెదేపా ఆవిర్భావం ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు తెచ్చింది. 38 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నది బీసీలే. మనం తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేసినా.. వారిలో ఏమైనా అపోహలున్నా సరిదిద్దుకోవాలి. బీసీల్లో తిరిగి ఆ నమ్మకాన్ని తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేయాలి. దానికి ఈ మహానాడే నాంది పలకాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ‘ఎన్ని కష్టనష్టాలున్నా.. ప్రజలకు అండగా నిలుద్దాం. కార్యకర్తల త్యాగాలు వృథా పోనివ్వకూడదు. ఎన్నికల తర్వాత మూడు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో పర్యటించాను. కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాను. అందరితో నిరంతరం మాట్లాడుతున్నాను. భవిష్యత్తుకు అవసరమైన పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాను. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కార్యకర్తలకు పాదాభివందనం
గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారన్న ఆయన... వైకాపా నేతలు ఉన్మాదులు మాదిరిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని...ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
'రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..? రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాలు న్యాయం చేసుకోవాలి'- చంద్రబాబు తెదేపా అధినేత