పట్టాభిని చంపాలనే దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దుండగుల దాడిలో గాయపడిన పట్టాభిని విజయవాడ గురునానక్ నగర్లోని ఆయన ఇంట్లో చంద్రబాబు పరామర్శించారు. పట్టాభితో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా నేతలు రౌడీల్లా తయారవుతున్నారని.. పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని చంద్రబాబు అన్నారు. పట్టాభికి వ్యక్తిగతంగా విరోధులు ఎవరూ లేరని.. ప్రజల కోసమే పోరాడుతున్నారని పేర్కొన్నారు.
నన్నూ చంపుతారా..?
'ఎంతమందిని చంపుతారు..?..చంపుతారా..? నన్ను కూడా చంపండి. జాగ్రత్తగా ఉండాలని వైకాపా నేతలను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రీ.. మీ మంత్రులకు ఇది సరికాదని చెప్పండి. సీఎం వైకాపా నాయకులు, కార్యకర్తలను అదుపు చేసుకోవాలి. పట్టాభిపై మొదటిసారి దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీసులు ఏం చేస్తున్నారు..? పోలీసులకు జీతాలు ఇచ్చేది జగన్ కాదు.. ప్రజల సొమ్మే' - చంద్రబాబు