ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Mahanadu: 'మహానాడు.. తెలుగుజాతికి పండుగ రోజు'

తెదేపా మహానాడు.. తెలుగుజాతికి పండుగ రోజని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ఆవిర్భవించాకే తెలుగు నేలపై నూతన చరిత్ర మొదలైందని చెప్పారు.

chandra babu speech in mahanadu
chandra babu speech in mahanadu

By

Published : May 27, 2021, 11:41 AM IST

Updated : May 27, 2021, 12:08 PM IST

తెదేపా మహానాడు ప్రారంభమైంది. కరోనా తీవ్రత దృష్ట్యా వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నాయకులు, దేశ విదేశాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లె పూదండ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత కరోనాతో ఇటీవల ఇటీవల మృతిచెందిన నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం మహానాడులో తెలుగుదేశం నేత ఎరిక్‌సన్‌ ప్రవేశపెట్టారు.

ఊహించని మహానాడు ఇది..

గతంలో ఎప్పుడూ లేనంతగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చనిపోవటంపై పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఊహించని మహానాడు ఇది. క్రియాశీలకంగా పనిచేసే నేతలు, కార్యకర్తలను కోల్పోవటం బాధాకరం. సబ్బంహరి, సత్యప్రభ, నడికుదిటి నరసింహారావు, కాగిత వెంకట్రావ్, జనార్థన్ థాట్రాజ్ వంటి సీనియర్ నేతల్ని పోగొట్టుకున్నాం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆ నేతల కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుంది" అని ప్రకటించారు.

నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాం..

మహానాడు తెలుగు జాతి మొత్తానికీ పండుగ రోజుని చంద్రబాబు అన్నారు. ఇది ఏ మతానికో పరిమితమైంది కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి ఘనంగా చేసుకునే పండుగ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం వచ్చాకే నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. సమాజహితం కోసం తెలుగుదేశం పనిచేస్తోందని చెప్పారు.

ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది..

"కొవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయి. సమస్యలపై ప్రజాచైతన్యం తీసుకొచ్చేలా పనిచేయాలి. కరోనాను ఎదుర్కొంటూ పోరాడాల్సిన పరిస్థితి. కరోనా అనేకమంది జీవితాలను అతలాకుతలం చేసింది."- చంద్రబాబు

కరోనా సంక్షోభ సమయంలో.. ప్రభుత్వం సరైన రీతిలో ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహించారు. ఆక్సిజన్ లేక, మందులు బ్లాక్‌మార్కెట్‌లో కొనలేక ఆర్థికంగా రోగులు చితికిపోయారని వాపోయారు. సంక్షోభ నివారణకు కలిసి పనిచేద్దామని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వానికి సలహాలిస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. సలహాలను ఎగతాళి చేసి పారాసిటమాల్, బ్లీచింగ్‌తో పోతుందని మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదన్నారు. తిరుపతి రుయాలో చనిపోయిన వారి సంఖ్యపై అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23 మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారని అన్నారు.

ఆనందయ్య మందుపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆనందయ్య వైద్యంపై తప్పుచేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేను వదిలేసి పరామర్శించే తెదేపా నేతలపై చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామని అన్నారు.

మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు

మూడు ముక్కలాట ఆడారు..

కొవిడ్‌ సమయంలో ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని చంద్రబాబు అన్నారు. పేదరికం పెరుగుతోందని.. జీవన ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. రైతులు మార్కెట్‌కు సరకు తీసుకెళ్లి నిరాశతో వెనుదిరిగి రోడ్డుపై పంట పారబోస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారని ధ్వజమెత్తారు.

అక్రమ అరెస్టులు చేస్తారా..?

"ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? మాట్లాడే వారి నోరు మూసేయాలంటూ స్టేట్ టెర్రరిజానికి పాల్పడతున్నారు. కోర్టులను కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతోందో అర్థం చేసుకోవాలి. అచ్చెన్నాయుడుతో మొదలుపెట్టిన అక్రమ కేసులు జనార్దన్‌రెడ్డి వరకూ కొనసాగించారు. రఘురామపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారు. స్థానికంగా అంతా మేనేజ్ చేసి సుప్రీంకోర్టులో అడ్డంగా దొరికిపోయారు. బెయిల్ రాకుండా ఉండేలా కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

తెదేపా నేతల మీద కేసులపై మాట్లాడుతున్న చంద్రబాబు

ఇదీ చదవండి:

జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం

Last Updated : May 27, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details