ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ: చంద్రబాబునాయుడు

తెదేపా నేతలు, కార్యకర్తలపై వైకాపా తప్పుడు కేసులు పెడుతోందనీ.. ప్రశ్నించే హక్కు కాలరాస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సెప్టెంబర్ 3 నుంచి గుంటూరులో వైకాపా బాధితుల పునరాశ్రయ శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.

By

Published : Aug 29, 2019, 6:11 PM IST

సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ: చంద్రబాబునాయుడు

తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో తెదేపా నేతలతో భేటీ అయ్యారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని తెలిపారు. అప్పటి నుంచే గుంటూరులో వైకాపా బాధితుల పునరాశ్రయ శిబిరం నిర్వహిస్తామన్నారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల బాధితులు అందరికీ ఆశ్రయం కల్పిస్తామని స్పష్టంచేశారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులు శిబిరాల్లోనే ఉండవచ్చన్నారు.

తప్పుడు కేసులే వారి అజెండా
మొన్న కూన రవికుమార్, నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నేడు కరణం బలరాం.. ఇలా తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే వైకాపా లక్ష్యమని చంద్రబాబు విమర్శించారు. పాత కేసులు తవ్వడం వైకాపా వేధింపులకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. వందలాది మంది కార్యకర్తలపై లేని కేసులు పెడుతున్నారనీ.. నోరునొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రశ్నించే హక్కు లేదా?
ప్రశ్నించే హక్కును వైకాపా నేతలు కాలరాయాలని చూస్తున్నారని తెదేపా అధినేత దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా చేయాలనుకుంటున్నారనీ.. ఇంత అరాచక పాలన తన జీవితంలో చూడలేదన్నారు. తెదేపా ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చిందనీ.. జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. అయినా గ్రామాల్లో వైకాపా అరాచకాలు తగ్గలేదన్నారు. మొత్తం పోలీసు వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details