CBN LETTER:వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా, కావాలని తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిందని, డయాఫ్రం వాల్ ఎప్పుడు దెబ్బతిందో కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 71% పూర్తవగా... వైకాపా ప్రభుత్వం తన అసమర్థ నిర్ణయాలతో అవరోధాలు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. గుత్తేదారుల్ని మార్చవద్దంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చేసిన సూచనల్ని జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఏకపక్షంగా, మొండిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని.. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్రప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతికంగా జరిగిన నష్టంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కి చంద్రబాబు బుధవారం లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వానికి కేంద్రం వివిధ సందర్భాల్లో చేసిన సూచనలు, పీపీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పత్రాలను ఆ లేఖకు జతచేశారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు కారణాలేంటో గుర్తించాలని, ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వరద సమయంలో గాలికొదిలేశారు..
2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును బలిపెట్టడం ప్రారంభించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రాజెక్టు గుత్తేదారు సంస్థను ప్రభుత్వం మారుస్తుందని 2019 జూన్ 1నే పత్రికల్లో వార్తలు వచ్చాయి. పనులు నిలిపివేయాలని ఆ సంస్థకు వెంటనే ఆదేశాలూ జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పనులు అప్పగించిన సంస్థను తొలగించి రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబరులో మరో సంస్థను ఎంపికచేశారు. జూన్ నుంచి ఆరు నెలలపాటు ప్రాజెక్టులో ఏ పనులూ జరగలేదు. ఆ ఆరు నెలలూ ప్రాజెక్టు ప్రదేశంలో గుత్తేదారు సంస్థ ప్రతినిధులెవరూ లేరు. అప్పటివరకూ పనిచేస్తున్న అధికారుల్ని కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆ సమయంలో వరద నియంత్రణ సరిగ్గా చేయకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దాన్ని ఒక ప్రముఖ సంస్థ నదీగర్భంలో 40 నుంచి 100 మీటర్ల లోతు వరకు రికార్డు సమయంలో నిర్మించింది. అంత లోతున డయాఫ్రం వాల్ నిర్మించడం దేశంలోనే మొదటిసారి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం అథారిటీ వారించినా..