‘దేవాలయాల్ని కూల్చేసే అధికారం ఎవరిచ్చారు? దేవుళ్ల విగ్రహాల్ని ధ్వంసం చేసే హక్కు ఎక్కడిది? రామతీర్థం దుర్మార్గంపై జగన్‌రెడ్డి ఎందుకు స్పందించలేదు? విజయనగరం వెళ్లిన ఆయన రామతీర్థం ఎందుకు సందర్శించలేదు?’ అని చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘దేవాలయాలపై దాడుల ఘటనలకు ముఖ్యమంత్రే కారణమని దేశం మొత్తం నిలదీస్తుంటే.. వాటిని తెదేపాకు అంటగట్టి, దుష్ప్రచారం చేయడం జగన్‌రెడ్డి బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ఠ. 136 ఆలయాల్లో జరిగిన దాడుల్లో అసలు నిందితుల్ని కాపాడేందుకే తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారు. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన వ్యక్తులే అలాంటి ఆరోపణలు చేయడం గర్హనీయం’ అని చంద్రబాబు మండిపడ్డారు.
దేవాలయాలపై దాడులకు జగనే కారణం: చంద్రబాబు - రామతీర్థం ఘటన అప్డేట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడైనప్పటికీ హిందూ దేవాలయాల్ని కాపాడటం ఆయన బాధ్యతని, దానిలో విఫలమైన జగన్‌కు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో ఒక్క మసీదుపై గానీ, చర్చిపై గానీ దాడులు జరగలేదని.. అన్ని మతాలవారి మనోభావాల్ని గౌరవించామని ఆయన పేర్కొన్నారు.
ఘర్షణలను ప్రేరేపించినవారిపై కేసులేవి?
‘రామతీర్థం దుర్ఘటన పరిశీలించేందుకు వెళ్లిన నాపైనా, అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులపైనా హత్యాయత్నం కేసులు పెట్టడం హేయం. నేను వెళుతున్నానని తెలిసి నాకంటే గంట ముందే వెళ్లి.. ఘర్షణలు ప్రేరేపించినవాళ్లపై కేసుల్లేవు. నా పర్యటనకు అనుమతించిన పోలీసులే మళ్లీ తప్పుడు కేసులు పెట్టారు. ఆ దేవస్థానం ట్రస్టీ పదవి నుంచి అశోక్‌గజపతిరాజును తొలగించడం మరో దుర్మార్గం. రామతీర్థంలో రాములవారి విగ్రహం శిరస్సును తెగ్గొట్టడం కిరాతక చర్య. రామభక్తుడైన సూరిబాబుపై తప్పుడు కేసులు పెట్టడం దారుణం. సీతమ్మ విగ్రహాన్ని ఎలుకలు ధ్వంసం చేశాయని, కరెంటు షార్ట్‌సర్క్యూట్ వల్ల రథాలు దగ్ధమయ్యాయని, పిచ్చోడు చేశాడని.. ఇలా పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:ప్రైవేటు ఆలయాల్లోనే దాడులు.. రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి...