రివర్స్ టెండరింగ్‌ను కోర్టులు, కేంద్రం, నిపుణులు తప్పుపట్టినా ప్రభుత్వానికి అర్థం కావటం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరెన్ని చెప్పినా సీఎంకు మారే జ్ఞానం రావట్లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పీపీఏలపై కేంద్రమంత్రి జగన్‌కు రాసిన లేఖపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానికి జగన్ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే వెల్లడించారని అన్నారు. తెదేపా అవినీతికి పాల్పడిందని ఆరోపించి అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుతే చవక అని కేంద్రమంత్రి కూడా లేఖలో చెప్పారని, కోర్టు, కేంద్రం చెప్పినా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తెదేపా హయాంలో సంస్కరణలు తెస్తే... నేడు వేలాది కోట్ల నష్టం అంటున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం మీడియా సమావేశం పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అసత్య ప్రచారం చేసే అధికారం అధికారులకు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. గతంలో తప్పులు చేసిన అధికారులంతా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలి పశువులు కావొద్దని హితవు పలికారు.
'కాంట్రాక్టుల కోసం.. పోలవరం నాణ్యతను పణంగా పెడుతున్నారు'
విద్యుత్ బస్సుల కాంట్రాక్టులను తమ వారికి అప్పగించేందుకు పోలవరం నాణ్యతను పణంగా పెడుతున్నారని వైకాపా సర్కార్‌పై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రూ.750 కోట్లు లాభమని రూ.7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు.
వారికెలా ఇస్తారు?
గతంలో పోలవరానికి ఎక్కువ కోట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు టెండర్ ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏ టర్బైన్‌లు అమర్చుతారో కూడా చెప్పని సంస్థకు ప్రాజెక్టును అప్పగిస్తారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.750 కోట్లు లాభమని రూ.7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ బస్సుల కాంట్రాక్టు కోసం పోలవరం నాణ్యతను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.తమ హయాంలో ఇసుకను దోచేశామని అబాండాలు వేశారన్న చంద్రబాబు... అప్పుడు ఇసుక ధర ఇప్పుడెంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరువల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామనుకుంటే 4 నెలల్లోనే నరకం చూపిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా పాలనపై దృష్టి పెట్టకుండా తెదేపా నేతలపై అవినీతి ముద్ర వేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
లీకేజీపై స్పందనేది
గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో అవకతవకలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.