ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MSP: రైతుకు ఒరిగేది అరకొరే.. రాష్ట్రం లెక్కలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం!

By

Published : Jun 10, 2021, 8:00 AM IST

క్వింటాలు ధాన్యం పండించడానికే రూ.2,114 అవుతోందని ఆంధ్రప్రదేశ్‌ లెక్క కట్టింది. దీనికి 50% కలిపితే.. రూ.3,171 చొప్పున ప్రకటించాలి. కేంద్రం మాత్రం ఉత్పత్తి వ్యయం రూ.1,293గా లెక్కేసి.. దానికి 50% కలిపి రూ.1,940 చేసింది. అంటే క్వింటాలుకు రూ.1,231 తక్కువగా ఇచ్చారు. ఎకరాకు (22 క్వింటాళ్ల దిగుబడి) రూ.27,082 మొత్తాన్ని రైతులు కోల్పోతున్నారు. కానీ కేంద్రం మాత్రం గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 పెంచామని ఘనంగా చెబుతోంది.

msp for paddy in india
msp for paddy in india

సాగుకు రైతులు పెట్టే ఖర్చు ఒకటైతే.. రాష్ట్రప్రభుత్వం చేసే సిఫారసు ఇంకోటి.. కేంద్రం కట్టే లెక్కలు మరోలా ఉంటాయి. దాని ప్రకారమే మద్దతు ధర నిర్ణయించి.. భారీగా పెంచామని ఘనంగా ప్రకటిస్తారు. అవైనా రైతుకు దక్కుతున్నాయా అంటే.. పంట చేతికొచ్చే సమయానికి పడిపోతాయి. పోనీ రాష్ట్రం చేసిన సిఫారసు ప్రకారమైనా మద్దతు ధర ఇస్తున్నారా అంటే.. దానికీ కోతలే. ఇన్ని వాతల మధ్య.. తమకు మిగిలేదేంటనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. 2021-22 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు చూస్తే.. ఈ విషయం స్పష్టమవుతోంది. పంటల వారీ ఉత్పత్తి వ్యయంపై వ్యవసాయ శాఖ సిఫారసుల ప్రకారం చూస్తే.. 50% అదనం అనేది ఒట్టి మాటే.

అడిగిందే తక్కువ..

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వ్యవసాయశాఖ సిఫారసు చేసిన ధరలు తక్కువే. రాష్ట్రాల వారీ ఖర్చుల్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించారని అనుకున్నా.. మన దగ్గర ఖర్చు తక్కువ కాదు. అయినా ఉత్పత్తి వ్యయం మాత్రం తక్కువగానే లెక్కించారు.

* క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వ్యయం:కేరళ రూ.2,852, కర్ణాటక రూ.2,733, తెలంగాణ రూ.2,738

* జొన్న:కర్ణాటక 4,256, తెలంగాణ రూ.3,924, తమిళనాడు రూ.2,576

* రాగి: కర్ణాటక 4,082, తెలంగాణ రూ.2,893, ఉత్తరాఖండ్‌ 2,582

* కంది: తెలంగాణ రూ.8,466

* పెసర:కర్ణాటక రూ.9,456, తెలంగాణ రూ.6,926

*మినుము: కర్ణాటక రూ.7,145, తమిళనాడు 6,488, తెలంగాణ 6,303

*వేరుసెనగ: కర్ణాటక రూ.6,998, తెలంగాణ రూ.5,957

*నువ్వు: తెలంగాణ రూ.13,202, రాజస్థాన్‌ రూ.8,112, తమిళనాడు రూ.7,822, గుజరాత్‌ రూ.6,921

* పత్తి: తెలంగాణ రూ.10,725, కర్ణాటక రూ.5,657

లెక్కల్లో ఘనం.. వాస్తవంలో?: మద్దతు ధరల నిర్ణయంలో భాగంగా ఎకరాకు దిగుబడి, క్వింటాలుకు ఉత్పత్తి వ్యయాన్ని లెక్కిస్తారు. ఇందులోనూ రాష్ట్రాల మధ్య తేడా ఉంటోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ దిగుబడి వస్తే.. మరికొన్ని చోట్ల తక్కువగా వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావమూ ఉంటుంది. ఏటా తుపానులు, భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కరవు రక్కసి వెన్నాడుతోంది. వీటన్నింటినీ తట్టుకుని సాగు చేయడం రైతులకు తలకు మించిన భారమే. అనుకున్న దిగుబడులు రావట్లేదు. అయినా ప్రభుత్వాలు.. తమ లెక్కల్లో సగటు దిగుబడులు తయారు చేసుకుని వాటి ప్రకారం ఉత్పత్తి వ్యయం లెక్క కడుతున్నాయి.

మద్దతు ధర దక్కింది: రైతులు తమ ఉత్పత్తుల్ని మద్దతు ధరకే అమ్ముకుంటున్నారని సీఏసీపీ గణాంకాలు చెబుతున్నాయి. ధాన్యానికి 2016-17 నుంచి 2018-19 మధ్య మూడేళ్లలో.. సగటున 145 రోజుల మార్కెట్‌ ధరలు పరిశీలిస్తే 144 రోజుల పాటు మద్దతు ధర లభించిందని వెల్లడించింది. 2020 అక్టోబరు నుంచి 2021 ఫిబ్రవరి మధ్య మద్దతు ధర కంటే ఎక్కువే లభించినట్లు చెప్పింది. వేరుసెనగకు 2020 అక్టోబరు నుంచి 2021 ఫిబ్రవరి మధ్య చూస్తే.. 71 రోజుల్లో 15 రోజుల పాటు మద్దతు కంటే ఎక్కువ ధరలే ఉన్నాయి. 39 రోజుల పాటు 15% కంటే తక్కువ ధరలు లభించాయని వివరించింది.

కంది దిగుబడి ఎకరాకు 2.4 క్వింటాళ్లు వస్తుందని రాష్ట్రం, 3.30 క్వింటాళ్లని కేంద్రం లెక్కలేశాయి. సగటున 2.50 క్వింటాళ్ల లెక్కన చూసినా.. ప్రస్తుత మద్దతు ధర క్వింటాలుకు రూ.6,300 చొప్పున చూస్తే ఎకరాకు రూ.15,750 వస్తుంది. ఎకరా కౌలు రూ.8వేలు, పెట్టుబడి రూ.10వేల లెక్కన చూసినా.. రైతుకు నష్టమే మిగులుతుంది.

ఇదీ చదవండి:

వరి కనీస మద్దతు ధర పెంపు

ABOUT THE AUTHOR

...view details