ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు - అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ

బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపులు
బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపులు

By

Published : Mar 2, 2022, 4:30 PM IST

Updated : Mar 3, 2022, 4:28 AM IST

16:28 March 02

ఏపీ రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో ప్రొవిజన్‌ పెట్టిన కేంద్రం

Amaravati Capital:ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2022-23 బడ్జెట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పద్దుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి అని పేర్కొంటూ అక్కడ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, గృహసముదాయాల నిర్మాణం, భూముల కొనుగోలుకు రూ.2,570 కోట్లవుతుందని లెక్క గట్టింది. ఈ బడ్జెట్‌లో మాత్రం దానికి రూ.5 లక్షలే కేటాయించడం గమనార్హం. అమరావతిలో ఉమ్మడి కేంద్రీకృత సచివాలయం నిర్మాణానికి రూ.1,214.19 కోట్లు, సాధారణ నివాస సముదాయ నిర్మాణం (జనరల్‌పూల్‌ రెసిడెన్షియల్‌ ఎకామిడేషన్‌- జీపీఆర్‌ఏ) కోసం రూ.1,126.55 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటికి బడ్జెట్‌లో రూ.లక్ష చొప్పున మాత్రమే కేటాయించడం గమనార్హం. సాధారణ నివాస సముదాయాల నిర్మాణానికి భూమి కొనుగోలు కోసం రూ.21.90 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, ఇప్పటి వరకు రూ.18.03 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొంది. ఈ బడ్జెట్‌లో దీనికీ రూ.లక్ష కేటాయించింది. అమరావతిలో సాధారణ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కొనుగోలుకు రూ.6.69 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ఇప్పటివరకూ రూ.4.38 కోట్లు ఖర్చు చేసింది. ఈ బడ్జెట్‌లో లక్ష కేటాయించారు.

  • అమరావతిలో ఏజీ కార్యాలయానికి సంబంధించిన 300 సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసి రూ.లక్ష కేటాయించింది.
  • విశాఖపట్నంలో సాధారణ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ.111 కోట్లు, అందుకు భూమి కొనుగోలుకు రూ.50 కోట్లు, నివాస సముదాయాల నిర్మాణానికి భూమికి రూ.160 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.238కోట్లు అవసరమని పద్దుల్లో పొందుపరిచింది.
  • విజయవాడలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికి రూ.4 కోట్లు, విజయవాడ, విశాఖపట్నాల్లో హాలిడే హోమ్‌ల నిర్మాణానికి రూ.20 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ అన్ని ప్రాజెక్టులకూ రూ.లక్ష చొప్పున కేటాయించింది.

నిధులివ్వడానికి కేంద్రం అంగీకరించినట్లే!

కేంద్ర బడ్జెట్‌ పుస్తకాల్లో ప్రాజెక్టుల పేర్లు చేర్చి, వాటికి నిధుల కేటాయింపు నామమాత్రంగా జరిపినా వాటికి కేంద్రం నిధులివ్వడానికి అంగీకరించినట్లుగానే పరిగణిస్తారు. అయితే ఆ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించి, ఎన్నేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయిస్తారో అందుకు తగ్గట్టు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఆనవాయితీ. ప్రస్తుత పద్దులను చూస్తే ఈ నిర్మాణాలకు వేగంగా డీపీఆర్‌లు సమర్పిస్తే నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణ బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయించినా తదుపరి అంచనాల సవరణ వచ్చేనాటికి వాటిని పెంచుకోవడానికీ అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి

AP Budget: మార్చి 7 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

Last Updated : Mar 3, 2022, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details