కరోనా కారణంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి, మరో 6 వారాల పాటు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏమిటి అనే చర్చ సాగుతోంది. ఆర్థికశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి అడ్వాన్సుగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తీసుకుని ఏప్రిల్‌లోనూ సమావేశాలు కొనసాగించాలనే ఆలోచనతో ఉన్న అధికారులు తాజా పరిణామంతో సందేహంలో పడ్డారు.
ప్రభుత్వ దైనందిన విధులకు కోడ్ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం దేనికైనా కోడ్ నుంచి మినహాయింపులు కోరితే సానుకూల, ప్రతికూలాంశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ ప్రకటించింది. ఇంతకుముందు ఉన్న వరకు అభిప్రాయం ప్రకారం... ఒక్క మార్చి 29న పంచాయతీ ఎన్నికల రోజున అనుమతి తీసుకుంటే సరిపోతుందని, బడ్జెట్ సమావేశాలు 2 నెలల్లోనూ కలిపి నిర్వహించుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ మరో 6 వారాల పాటు పొడిగించినట్లయింది. తరువాత ఎన్నికల నిర్వహణ సమయంలోనూ ఈ కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఎలా అన్నది తేలాల్సి ఉంది. ఈ అంశంపై ఆర్థిక శాఖ అధికారులు ఇవాళ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.