ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయ లబ్ధి పొందేందుకే తెదేపా ప్రయత్నాలు: బొత్స - bosta satyanarayana comments on TDP

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఇతర మత అంశాలకు సంబంధించిన అన్నీ ఘటనలూ ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తిరుమలలో డిక్లరేషన్​ గురించి నానా హంగామా చేసిన తెదేపా నేతలు.. ప్రజలకు ఏం సాధించిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఘటనలపైనా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.

bosta-satyanarayana-fires-on-tdp-over-declaration
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Sep 26, 2020, 7:34 PM IST

అంతర్వేది ఆలయం, దుర్గగుడి రథంలో వెండి సింహాల చోరీ ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇవన్నీ దురుద్దేశపూర్వకంగానే జరుగుతున్న ఘటనలని మంత్రి ఆరోపించారు. వీటి వెనుక తెదేపాకు చెందిన వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. మతపరమైన విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు తెదేపా గడిచిన కొన్నిరోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే... కోర్టుల్లో నిలుపుదల ఆదేశాలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుతిందని.. మంత్రిగా అధికారికంగా ఈ ప్రకటన చేస్తున్నానని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సీఎం తిరుమల పర్యటనపై తీవ్ర వివాదం సృష్టించారని ఆరోపించారు. ఈ వివాదం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అన్న విషయాన్ని తెదేపా నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details