న్యాయస్థానం నుంచి తప్పించుకునేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju fire on ycp government over capital city) అన్నారు. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అసత్యాలు, బూతులు మాట్లాడేందుకు శాసనసభను వేదికగా చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమపై జగన్‌కు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందా ? అని ప్రశ్నించారు.
ఈ రెండున్నరేళ్ల కాలంలో సీమకు చెందిన తెలుగుగంగ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. ఇంకా వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తామని ఎలా చెబుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అనంతపురం, కర్నూలు, తిరుపతి, విశాఖలో విద్యాలయాలు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.