కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వనందునే ఐటీఐఆర్‌ను రాష్ట్రం కోల్పోయిందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర నిధులు లేని రాష్ట్ర పథకాలేమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు.
దిల్లీకి వెళ్లిన కేసీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడగలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే తెరాస సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులను తెరాస నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నిధులపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం, హరితహారం, రైతువేదికలకు కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ.196 కోట్లు ఇస్తే నిధులను దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు సూచించారు.