అవినీతి రహిత పాలనే ధ్యేయంగా భాజపా-జనసేన కూటమి పని చేస్తుందని, తమ అభ్యర్థులను మున్సిపల్ ప్రజానీకం ఆదరించాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. అర్హులైన వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని స్పష్టం చేశారు. తమను గెలిపిస్తే పట్టణ స్థానిక సంస్థలను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొస్తామని, ప్రజలు చెల్లించే పన్నులను దారి మళ్లించబోమని, వాటిని తిరిగి పట్ణణాల అభివృద్ధికే వెచ్చిస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో తమ కూటమి గుంటూరు నగరం సహా తెనాలి, సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల పట్టణాల్లో మొత్తంగా 222 డివిజన్లు, వార్డులకు 111 స్థానాల్లో కూటమి పోటీ చేస్తుందని తెలిపారు. వీటిలో... 38 స్థానాల్లో భాజపా, 73 స్థానాల్లో జనసేన తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. శుక్రవారం ఆయన గుంటూరులో తన నివాసంలో మాజీ మంత్రులు రావెల కిశోర్‌బాబు, శనక్కాయల అరుణ, జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌తో సమావేశమయ్యారు.
గుంటూరు నగరపాలికలో 2014 నుంచి ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని చూస్తున్నామని, భవన అనుమతులు కావాలన్నా, కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నా తొలుత ఎమ్మెల్యేకు ట్యాక్స్ సమర్పించుకోవాలని, ఆ తర్వాతే మున్సిపల్ అధికారులు వాటికి మోక్షం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని తాము పూర్తిగా స్వస్తి పలికిస్తామని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు తమనే ఎన్నుకోవాలని కోరారు. అధికార పార్టీకి దీటుగా తాము పని చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలు విజ్ఞతతో ఓటేయాలని సూచించారు. గుంటూరు నగరం తన హయాంలోనే అభివృద్ధి చెందిందని, యూజీడీని కేంద్రం మంజూరు చేసిందన్నారు. మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికల్లో తిరిగి నామినేషన్లు స్వీకరించాలని తాము ఎన్నికల కమిషన్‌ను కలిసి కోరబోతున్నామని వెల్లడించారు. కోటప్ప కొండ తిరునాళ్లలో ప్రభలను అనుమతించాలని ఆయన జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ పురపాలికల్లో అధికార పార్టీ అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారని, వారు ఆ విధంగా చేయకపోవటం వల్లే కనీసం నామినేషన్లు సైతం వేయనీయకుండా ప్రత్యర్థులపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.