ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Best tourist village : బెస్ట్ టూరిస్ట్​ విలేజ్​ కాంటెస్ట్​లో.. భూదాన్ పోచంపల్లి - bhoodan pochampally news

ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోన్న బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్​లో భారత్​ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించాయి. అందులో ఒకటి తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి. బెస్ట్ టూరిజం విలేజ్​గా ఎంపికైతే భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఈ గ్రామంతో పాటు మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్ థాన్, మధ్యప్రదేశ్​లోని చారిత్రాత్మక గ్రామం లాద్ పురా ఖాస్​ కూడా పోటీలో ఉన్నాయి.

Best tourist village
Best tourist village

By

Published : Sep 16, 2021, 11:07 AM IST

Best tourist village : బెస్ట్ టూరిస్ట్​ విలేజ్​ కాంటెస్ట్​లో.. భూదాన్ పోచంపల్లి

ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోన్న బెస్ట్ టూరిజం కాంటెస్ట్​లో భారత్​ నుంచి ఎంట్రీ సంపాదించిన మూడు గ్రామాల్లో తెలంగాణకు చెందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ఒకటి. గాజుల పోచంపల్లిగా ఉన్న ఈ గ్రామం.. భూదాన్ కార్యక్రమంతో భూదాన్ పోచంపల్లిగా పేరుగాంచింది. జిల్లా వ్యాప్తంగా.. 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధిక సంఖ్య పోచంపల్లిదే.

ఇక్కత్​కు పెట్టింది పేరు..

పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ వస్త్రాలకు పేటెంట్ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ చేనేత కళాకారులకు ఎంతో ప్రతిభ ఉంది. గడిచిన మూడేళ్లలో భోగ బాలయ్య, సాయని భరత్, భారత వినోద్ లాంటి వాళ్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాంప్రదాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను ఇక్కడి ప్రజలు జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు.

అలా భూదాన్ పోచంపల్లిగా మారింది..

1951లో ఆచార్య వినోబాబావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ గ్రామం నాంది పలికింది. ఇక్కడి భూదాత వేదిరె రామచంద్రారెడ్డి వినోబాబావే పిలుపుమేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి స్వీకరించి భూమిలేని పేదలకు పంచిపెట్టారు. ఈ గ్రామం భూదానోద్యమంతో భూదాన్ పోచంపల్లి గా మారింది. గ్రామంలో ఓ మ్యూజియం కూడా ఉంది. దీని నిర్వహణ పర్యాటక శాఖ చూసుకుంటోంది.

పోచంపల్లి వాసుల సంతోషం..

తమ గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్​కి ఎంట్రీ సంపాదించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితాల్లోనూ పోచంపల్లి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే పర్యాటకులు ఎక్కువగా వస్తారని.. తద్వారా తమ గ్రామ ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించి.. గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.

ఈ అంశాలే పరిగణనలోకి..

గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్​ను నిర్వహిస్తోంది. సాంఘిక, ఆర్ధిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి, గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు?, గ్రామీణ పర్యాటకానికి ఎంత స్కోప్ ఉంది?, అక్కడి ప్రజలు దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఆ పోటీ ఉద్దేశం ఇదే ..

గ్రామీణ పర్యాటకానికి ఊతం ఇచ్చేలా వాటి అభివృద్ధికి, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనశైలి , నూతన పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన , సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటంతో పాటు ఆర్థిక అసమానతల తొలగింపు ఈ పోటీ ఉద్దేశం. ఎంపికైన గ్రామాలను అభివృద్ధి చేయటం, గుర్తింపు తీసుకురావటం వంటి పనులు ఈ సంస్థ చేయనుంది.

బెస్ట్ టూరిస్ట్ విలేజ్​..

సెప్టెంబర్ 15 వరకు ఎంట్రీలను ప్రపంచ వ్యాప్తంగా దాని సభ్యదేశాల నుంచి స్వీకరించనుంది. అక్టోబర్​లో వచ్చిన ఎంట్రీల నుంచి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ని ఎంపిక చేయనున్నారు. యూఎన్​డబ్ల్యూటీఓ సూచించిన అన్ని అర్హతలు పోచంపల్లికి ఉన్నాయని, బెస్ట్ టూరిజం విలేజ్​గా పోచంపల్లి ఎంపికయ్యేలా ప్రపంచ పర్యాటక సంస్థకు అవసరమైన సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని పోచంపల్లి వాసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details