కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వీయ ఆధారిత భారతం ప్యాకేజీ పట్ల మధ్యతరగతి కుటుంబాల్లో కొంతమేరకు ఆనందం వ్యక్తమవుతోంది. పేదలకు ఆహార భరోసా, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ ద్వారా జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభించినట్లు అయింది. పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య (ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలు దాదాపు 5వేలు ఉన్నాయి. విజయవాడ ఆటోనగర్‌లోనే 2 వేలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణకు మోక్షం లభించింది. గతంలో రూ25లక్షలు ఉన్న సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడిని రూ.కోటికి, టర్నోవర్‌ను 5కోట్లకు పెంచారు.
చిన్న పరిశ్రమల పెట్టుబడి రూ.5కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంచారు. మధ్యతరహా పరిశ్రమలకు రూ.10కోట్ల నుంచి 20 కోట్లుకు పెంచారు. దీని వల్ల ఆయా రాయితీలు పెరిగే అవకాశం ఉంది.
* ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఎంఎస్‌ఎంఈలలో పనిచేస్తున్న కార్మికులకు రూ.15 వేల లోపు ఉన్నవారికి ప్రభుత్వమే యాజమాన్యం తరపున పీఎఫ్ జమ చేస్తుంది. ఇది 24 శాతం ఉంటుంది. జిల్లాలో దాదాపు 10వేల మంది వరకు ఈ తరహా కార్మికులు ఉంటారు. మొత్తం ఆరు నెలల పాటు ఇవ్వనుంది. కనీసం రూ.4కోట్ల మేర లబ్ధి ఉంటుంది.
* రుణాలపై ఏడాది పాటు మారిటోరియం ఉంది. కానీ వడ్డీ మాఫీ చేయలేదన్న అసంతృప్తి పారిశ్రామిక వర్గాల్లో ఉంది.
* విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.90 వేల కోట్లు కేటాయించడంతో ఆ మేరకు వినియోగదారులకు రాయితీలు లభించే అవకాశం ఉంది. విద్యుత్తు యూనిట్ ధరను తగ్గిస్తారని ఆశిస్తున్నారు. ఇది అమలు కావాల్సి ఉంది. ఇది జరిగితే.. జిల్లాలో 16 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
సంక్షేమానికి ప్రాధాన్యం!
* జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు 4.59 లక్షలు ఉన్నాయి. వీరికి మూడు నెలల పాటు రూ.500 చొప్పున జమ చేయనున్నారు. నెలకు రూ.22.98కోట్లు లబ్ధిపొందనున్నారు.