ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Aims Director on Omicron: 'సహజ ఇన్ఫెక్షన్‌.. టీకా రక్ష.. రెండూ కలిస్తే ‘హైబ్రిడ్‌’ శక్తి' - హైబ్రిడ్ శక్తి

Aims Director on Omicron: మానవశరీరం సహజసిద్ధమైన రోగ నిరోధకశక్తితో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. గత రెండేళ్లలో దేశంలో లక్షల మంది కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో కరోనా ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందాయి. మరోవైపు ఒక మోతాదు తీసుకున్న వ్యక్తుల్లో వైరస్‌కు వ్యతిరేకంగా అధిక రోగనిరోధక శక్తి వృద్ధి చెందింది. ఈ రెండూ కలవడం వల్ల హైబ్రిడ్‌ శక్తి ఉద్భవిస్తోందని ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ వికాస్ భాటియా వెల్లడించారు. ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

1
1

By

Published : Dec 29, 2021, 7:52 AM IST

Aims Director on Omicron: భారత్‌లో దాదాపు 80 శాతం మంది జనాభాలో ‘హైబ్రిడ్‌ రోగ నిరోధక శక్తి’ అభివృద్ధి చెందిందని, దీనికి ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సామర్థ్యమూ ఉందని తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ వికాస్‌ భాటియా స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా దేశ జనాభాలో 80 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు సీరో సర్వేలు చెబుతున్నాయని, ఇదే క్రమంలో దేశంలో 90 శాతం మంది కనీసం ఒక డోసు టీకాను పొందారని చెప్పారు. కొవిడ్‌ బారిన పడటం వల్ల వచ్చే సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి.. టీకా ద్వారా పొందే రక్షణ.. రెండూ కలవడం ద్వారా ఉద్భవించే ‘హైబ్రిడ్‌ రోగ నిరోధక శక్తి’కి రెట్టింపు బలముంటుందని చెప్పారు. ఇది దీర్ఘకాలం రక్షణనిస్తుంది. కొవిడ్‌ ప్రభావం తగ్గేవరకు మనల్నిమనం సురక్షితంగా ఉంచుకుంటే చాలనేది గతంలో వచ్చిన వైరస్‌ల విషయంలో రుజువైంది. కాబట్టి ప్రజలు రెండు డోసుల టీకా పొందడానికి ముందుకు రావాలి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా కొవిడ్‌ నిబంధనలను పాటించాలి. మాస్కు ధరించడాన్ని మరిచిపోవద్దని సూచించారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ వికాస్ భాటియాతో ‘ఈనాడు- ఈటీవీ భారత్​’ ప్రతినిధి అయితరాజు రంగారావు ముఖాముఖి...

  • బూస్టర్‌ డోసు అవసరముందా?

మన దేశంలో జనాభా ఎక్కువ. 18 ఏళ్లు దాటిన వారిలో ఇంకా 50 శాతం మంది కూడా రెండోడోసు దాటలేదు. ముందుగా అందరూ రెండు డోసులు స్వీకరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్‌ డోసు అవసరమేనని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తీసుకోవాలి. ఒమిక్రాన్‌ లక్షణాలు స్వల్పంగా ఉండటం వల్ల ఆందోళన అక్కర్లేదు. లక్షల సంఖ్యలో వైరస్‌ బారినపడితే.. అప్పుడు కచ్చితంగా వైద్యసేవలను సమర్థంగా అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మూడోదశను ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి.

  • టీకాలు ఇన్ఫెక్షన్‌ రాకుండా ఆపుతాయా?

టీకాలను పొందడం ద్వారా ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఆపకపోయినా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన అవసరం లేకుండా అవి రక్షణ కల్పిస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెంటిలేటర్‌ చికిత్స వరకూ వెళ్లకుండా టీకాలు కాపాడుతున్నాయి. తద్వారా మరణాల సంఖ్య పెరగకుండా రక్షణ లభిస్తోంది. పిల్లలపైనా టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ 30 రకాల ఉత్పరివర్తనాలకు లోనైందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీనిపై టీకాలు ఎంతమేరకు పనిచేస్తాయనేది ఇప్పుడే చెప్పలేం. కానీ వైరస్‌ తీవ్రత తగ్గే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాలోనూ కేసులు పెరిగినా.. మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. దీన్నిబట్టి రోగిని ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెట్టేయకుండా టీకా అడ్డుకుంటుందని అర్థమవుతోంది.

  • టీకా ధ్రువపత్రం వెంట తీసుకెళ్లడం అవసరమా?

చాలా అవసరం. జర్మనీలో రెండు టీకాలు తీసుకునేవరకు రెస్టారెంట్‌లోకి కూడా ప్రవేశించలేరు. ఇక ముందు మన దగ్గర ఎక్కడికి వెళ్లాలన్నా ధ్రువపత్రాన్ని చూపించడం తప్పనిసరవుతుంది. అంతర్జాతీయంగానే కాదు.. నగరాల్లోనూ అంతర్గతంగా రెస్టారెంట్లకు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా టీకా ధ్రువపత్రం చూపించాల్సిన పరిస్థితులొస్తాయి.

  • కొత్త వేరియంట్లను ఎదుర్కోవడంలో టి-కణాల ప్రాధాన్యం ఏమిటి?

కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు టి-కణాల్లోనూ ఏర్పడతాయి. ఇవి అత్యవసర సైన్యంగా పనిచేస్తాయి. వైరస్‌ మరోసారి శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. ఇవి ప్రేరేపితమై రక్షణ కల్పిస్తాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌పైనా పనిచేస్తాయనే విశ్వాసం ఉంది. అయితే ప్రయోగపూర్వకంగా నిరూపితమవ్వాలి. 2022లో ఈ వైరస్‌ బలహీనపడి సాధారణ వైరస్‌గానూ ఉత్పరివర్తనం చెందే అవకాశాలున్నాయి.

  • భారత్‌లో మూడోదశ ఉద్ధృతిపై మీ అంచనా?

దేశంలో మూడోదశ ఉద్ధృతి వచ్చే అవకాశాలు ఎక్కువే. దాని తీవ్రత తక్కువగా ఉండవచ్చు. ఇది దేశమంతటికీ విస్తరిస్తుందా లేదా అన్న అంశంపై ఇప్పుడే అంచనాకు రాలేం. ఎందుకంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ తక్కువగా జరుగుతోంది. అలాంటి ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

  • బీబీనగర్‌ ఎయిమ్స్‌లో సన్నద్ధత ఎలా ఉంది?

2020లో బీబీనగర్‌లో వైద్యసేవలు ప్రారంభించాం. ఓపీ, ఐపీ సేవలు నిర్వహిస్తున్నాం. పిల్లల కోసం ప్రత్యేక ఐసీయూ, వార్డులను ఏర్పాటుచేశాం. 90 మంది అనుభవజ్ఞులైన వైద్యులు, 100 మందికి పైగా నర్సింగ్‌ అధికారులున్నారు. 2 ఆక్సిజన్‌ ప్లాంట్లున్నాయి. పెద్దవారి కోసం 10 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశాం. ఒమిక్రాన్‌ సహా.. కొవిడ్‌ బారినపడి తీవ్ర అనారోగ్యంతో వచ్చినా చికిత్స అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం.

  • పిల్లలపై ఒమిక్రాన్‌ ఎక్కువ ప్రభావం చూపుతుందా?

పిల్లల్లో ఎక్కువమంది ఇప్పటివరకూ వైరస్‌ బారినపడలేదు. వ్యాక్సిన్లు కూడా తీసుకోలేదు. పైగా ఒమిక్రాన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కాబట్టి పిల్లల్లో ఇది వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. రెండోదశలో డెల్టా తీవ్ర ఉద్ధృతి సమయంలోనూ చిన్నారుల్లో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడం, ఐసీయూలో చికిత్సలు పొందడం వంటివి ఎక్కువగా జరగలేదు. తీవ్ర దుష్ప్రభావాలు చూపకపోయినా.. ఒమిక్రాన్‌ పిల్లల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:

AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details