రస్-అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(రాకియా) ఏర్పాటు చేసిన అన్‌రాక్ అల్యూమినియం పరిశ్రమకు బాక్సైట్ సరఫరా ఒప్పందం, లీజుల రద్దు విషయంలో తమను సంప్రదించలేదని, ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానంలో మధ్యవర్తిత్వ కేసులో పరిహారం అంశాన్నీ రాష్ట్రమే చూసుకోవాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. లీజుల రద్దు గురించి తమకు ముందుగా తెలపకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బాక్సైట్ సరఫరా చేయకుండా లీజులు రద్దు చేశారంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరుతూ రాకియా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఈ నెల మొదటి వారంలో లండన్ కోర్టులో వాదనలు జరిగాయి. వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఇటీవల లండన్ వెళ్లి న్యాయస్థానంలో వాదనలు వినిపించి వచ్చారు. రెండో విడత మధ్యవర్తిత్వంపై చర్చించేందుకు మరికొందరు అధికారులు ఇటీవల లండన్ వెళ్లారు.
తవ్వకాలకు అవకాశం లేనందునే..
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వలేకపోవడానికి, అన్‌రాక్‌కు సరఫరా చేయలేక పోవడానికి, లీజుల రద్దుకు గల కారణాలను అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికారులు వివరించారు. రక్షిత అటవీ ప్రాంతంలో లీజులు ఉన్నాయని గనులశాఖ అధికారులు తెలిపారు. మావోయిస్టుల ప్రభావం ఉందని, కొంతకాలం కిందట ఇద్దరు నేతలను హత్య చేశారని ఐపీఎస్ అధికారి చెప్పారు. లీజు ప్రాంతాల నుంచి బాక్సైట్ ఖనిజాన్ని తరలించేందుకు వీలుగా రహదారి నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లభించడం ఇప్పుడప్పుడే సాధ్యంకాదని అర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీరు వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అన్‌రాక్ చెబుతున్నంత ఖర్చు లేదు
మరోవైపు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు, తదితరాలకు కలిపి రూ.వెయ్యి కోట్లుపైనే ఖర్చు అయిందని, ఆ మేరకు పరిహారం ఇప్పించాలని రాకియా కోరుతోంది. దీనిపై లండన్‌లో మధ్యవర్తి దగ్గర చర్చలు సాగుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటు, ఇతర ఖర్చులు కలిపి రూ.300-350 కోట్ల వరకే ఉంటుందని, చాలాకాలంగా పరిశ్రమలో ఎటువంటి కార్యకలాపాలూ లేవని అధికారులు మధ్యవర్తి దగ్గర వివరించనున్నట్లు తెలిసింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారమైతే ఆ మొత్తాన్ని రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల అన్‌రాక్‌లో రాకియా వాటా ఏపీఎండీసీకిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వీలుందని, తర్వాత ఆ వాటాను ఎవరికైనా విక్రయించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చేనెల మూడో వారంలో రానుంది. ఈలోపు మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ వివాదం..
పెన్నా గ్రూప్, రాకియా కలిసి అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్‌ను 2007లో ఏర్పాటు చేశాయి. ఇందులో పెన్నా గ్రూప్ వాటా 70 శాతం, రాకియా వాటా 30 శాతం. 2012-13లో పెన్నా గ్రూప్ వాటా 87 శాతానికి పెంచుకొని, రాకియా వాటాను 13 శాతానికి తగ్గించుకున్నారు. మరోవైపు విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి రక్షిత అటవీప్రాంతంలో బాక్సైట్ లీజులను ఏపీఎండీసీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ, అన్‌రాక్ పరిశ్రమకు బాక్సైట్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు సాగాయి. మావోయిస్టులూ దీనిని వ్యతిరేకించారు. దీంతో 2016లో అన్‌రాక్‌తో, ఏపీఎండీసీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేస్తూ అధికారులు ఆదేశాలిచ్చారు. 2019లో లీజులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రాకియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అన్‌రాక్‌కు ఒడిశాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాల్కో లీజుల నుంచి, ఒడిశా రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ లీజుల నుంచి బాక్సైట్ సరఫరా చేసేలా చూడాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అది సాధ్యం కాదని, వేలంలో పాల్గొని లీజులు పొందాలని కేంద్రం కొంతకాలం కిందట స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: వరుణుడి ప్రకోపం.. కన్నీటి సంద్రమైన కేరళ