ఆయన ఉదారతను చాటితే...వీళ్లు మూలనపడేశారు..! పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో... సుమారు నెలరోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ దాత... ప్రభుత్వానికి బ్యాటరీ వాహనాలను అందించారు. వెంటనే అమాత్యులు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేసేశారు. వాహనాలను వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. ఇదంతా గడిచి నెలరోజులు దాటినా....ఇప్పటికీ ఆ వాహనాలు మూలనపడే ఉన్నాయి. నెల రోజుల క్రితం తమిళనాడుకు చెందిన వీఎస్ఎల్ ఇండస్ట్రీస్ అధినేత హరికృష్ణ... ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం విరాళం అందిస్తామని ప్రతిపాదించారు. అందుకు సీఎం అంగీకరించడంతో అన్ని విభాగాలకు కలిపి 32 అధునాతన బ్యాటరీ వాహనాలను అందించారు.
గత నెల 3న ప్రారంభం
గతనెల 3న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని....ఈ వాహనాలను ప్రారంభించారు. పారిశుద్ధ్యం, కొవిడ్ నియంత్రణ అవసరాల కోసం వీటిని వినియోగిస్తామని ప్రకటించారు. పూర్తిగా బ్యాటరీతో నడిచే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందంటూ గొప్పగా చెప్పారు. ఇక అంతే ఆ వాహనాల సంగతి అటు మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకోలేదు. వాటన్నింటినీ అలా మూలనపడేశారు. దాదాపు నెలరోజులు కావస్తున్నా...వీటిని ఏ అవసరాలకూ వినియోగించడం లేదు. ఏయేశాఖకు ఎన్నెన్ని కేటాయించాలో తేల్చుకోలేకపోవడమే ఇందుకు కారణం. అధికారుల మధ్య సమన్వయ లేమితో దాతలు అందించిన వాహనాలు పాడైపోయే పరిస్థితికి చేరుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణతోపాటు, కొవిడ్ కేంద్రాల్లోనూ వాహనాలు కొరత ఉన్నా.....దాతల ఔదార్యంతో అందించిన ఈ వాహనాలను మాత్రం వినియోగించడం లేదు.
ఇదీ చదవండి
కాంట్రాక్టర్లూ కోర్టుకు వెళ్లండి.. అప్పుడే న్యాయం: ఆర్ఆర్ఆర్