Saddula Bathukamma celebrations: తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు... దిల్లీ, ఇతర రాష్ట్రాల్లు సహా విదేశాల్లోనూ సందడిగా సాగాయి. పట్టణాలు, పల్లెలు, ధనిక పేదా అన్న తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలను సేకరించి అందంగా పేర్చి కూర్చి సంబురాల్లో పాల్గొన్నారు.
ఓరుగల్లులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు:పండుగ సంబురాలతో ఇళ్లన్నీ పూలవనాలుగా మారాయి. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగాయి. పుట్టింటికి వచ్చిన సంతోషం ముఖంలో తొణికసలాడుతుంటే పడతులు.. 8 రోజుల పాటు పండుగలో పాల్గొన్నారు. ఇక ఇవాళ ఆఖరి రోజు సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు తారాస్థాయికి చేరుకుంటాయి. 8 రోజుల సందడి ఈ ఒక్క రోజులోనే కనపడుతుంది. ఇప్పటికే వనితలంతా బతుకమ్మలను పేర్చడంలో తలమునకలైయ్యారు.