Food Poison in Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు.
మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.