కరోనా విపత్తు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై అందరిలోనూ ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు. ఈ విషయమై అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఒక నివేదిక తయారుచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, సంక్షేమ, ఆరోగ్య శాఖలతో సంయుక్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులను అందులో పొందుపరిచింది. ప్రాథమికోన్నత (5, 6, 7), ఉన్నత (8, 9, 10) తరగతులను రెండుగా విభజించి రెండుదశల్లో గురుకులాలకు రప్పించాలని సూచించింది. ఇంటివద్ద ఉన్న సమయంలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించాలని, అసైన్‌మెంట్లు పాఠశాలకు పోస్టల్ ద్వారా పంపించేలా స్టాంపులతో కవర్లు అందించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో గురుకులాల బడ్జెట్‌ను సవరించాలని కోరింది.
బోధన ఇలా... సగం మంది సగం రోజులు ఇంటివద్దే..
తెలంగాణలో కరోనాతో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై స్పష్టత లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరగతులు మొదలు కాలేదు. మరీ తెలంగాణలోని గురుకుల పాఠశాలలు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై ఎన్నో సందేహాలు. ఈ విషయాలపై అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఒక నివేదిక తయారుచేసింది. ఆ అంశాలేంటో చూద్దాం.
తరగతి గదులు, డార్మెటరీల్లో విద్యార్థుల మధ్య తప్పనిసరిగా భౌతిక దూరం ఉండాలి. రెండుదశల్లో తరగతులు నిర్వహించనున్నందున 50 శాతం మంది ఉపాధ్యాయులే క్యాంపస్‌లో ఉండాలి. ఇంటివద్ద చదువుకునే విద్యార్థులతో గ్రూపులు తయారు చేసి, ఎప్పటికప్పుడు వారితో సంభాషిస్తూ, పాఠాలు బోధిస్తూ సందేహాలు నివృత్తి చేయాలి. భోజనశాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలి. బాత్‌రూమ్, టాయ్‌లెట్ల సంఖ్య ఆధారంగా డార్మెటరీలో ఉండే విద్యార్థుల సంఖ్యను ఖరారు చేయాలి. కరోనాపై అవగాహన పెంచేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిపుణులతో ఆరోగ్యం, భద్రతపై ఉపన్యాసాలు ఇవ్వాలి.
బోధన ఇలా ఉండాలి...
తొలి దశ ( ఆగస్టు-డిసెంబరు)
- ఈ దశలో 8, 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులను పాఠశాలకు రప్పించాలి.
- ఈ సమయంలో 5 నుంచి 7 తరగతుల విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువుకునేలా పాఠ్యాంశాలను అందజేయాలి.
- వీరికి స్మార్ట్ ఫోన్ల కన్నా కమ్యూనిటీ రేడియో ద్వారా బోధించేలా విద్యా, సంక్షేమశాఖలు పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- ఇంటివద్ద ఉండే విద్యార్థులు అక్కడే చదువుకుని అసైన్‌మెంట్లు చేసేలా ఏర్పాట్లు చేయాలి.
రెండో దశ( జనవరి- మే)
- ప్రాథమిక విద్యార్థులను (5-7) పాఠశాలలకు రప్పించి తొలిదశవారిని ఇళ్లకు పంపేయాలి.
- సరైన రక్షణ ఏర్పాట్లుంటే ఇంటర్ విద్యార్థులనూ ఈ దశలో రప్పించవచ్చు.
- తొలిదశలోని విద్యార్థులు ఇంటివద్దే చదువుకునేలా మెటీరియల్ అందించాలి.
- ఉపాధ్యాయులు వీడియో, ఆడియో కాన్ఫరెన్సు నిర్వహించాలి.
- విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఇచ్చిన అసైన్‌మెంట్లు తెప్పించుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- గురుకులాల్లో పనిచేసే వారికి, విద్యార్థులకు ప్రతిరోజూ తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలి.
- విద్యార్థులు వచ్చిన తొలి 14 రోజులు క్వారంటైన్ నిబంధన అమలు చేసి, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.
- విద్యార్థులు ప్రతిరోజూ శానిటైజేషన్, చేతులు కడుక్కోడం వంటివి తప్పనిసరి చేయాలి.
- సందర్శకుల వివరాలన్నీ తప్పనిసరిగా నమోదు చేయాలి. వారిని ప్రత్యేక గదికే పరిమితం చేయాలి.
- నిర్దేశించిన రోజే తల్లిదండ్రులు పిల్లలను చూసేందుకు రావాలి. భౌతిక దూరాన్ని పాటించాలి.
- గురుకుల ఉపాధ్యాయులు కుటుంబంతో క్యాంపస్‌లోనే ఉండేలా సదుపాయాలు కల్పించాలి.
ఇదీ చదవండి:మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!