తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగపూడి సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూమి పూర్తిగా నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకే దాదాపు 587 ఎకరాల భూమి ముంపు బారిన పడింది. ముందు భాగంలో 4 అడుగుల లోతు, మధ్యలో 10 అడుగుల లోతు వరకూ నీరు చేరింది.
బూరుగపూడి, కోరుకొండ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు నీటిలో దిగి పరిశీలించగా వారు నడుము భాగం వరకు మునిగిపోయారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూముల సేకరణపై స్థానిక ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
వరద కారణంగా ఆవ భూముల్లో నాలుగు నుంచి 14 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇలాంటి ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేపటి నాడు ఇళ్లు పూర్తి చేసి ఇస్తే నిలబడుతాయా..? మోస్తరు వర్షాలకే ఇలా అయితే భారీ వరదలు వస్తే ప్రజల పరిస్థితేంటి...? - స్థానికులు
20వేల మందికి ఇచ్చేలా....
సుమారు 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ భూమిని సేకరించారు. ఎకరం రూ.45లక్షల చొప్పున కొందరికి పరిహారం కూడా చెల్లించారు. ఈ ప్రాంతంలో ముంపు అధికమని జలవనరుల శాఖ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి భూములను సేకరించడం గమనార్హం. దీనిపై కోరుకొండ మండలానికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది.
ప్రభుత్వం వద్ద నివేదిక
న్యాయస్థానం స్టే ఇచ్చిన తర్వాత ఆవ భూముల భౌతిక స్థితిపై అధ్యయనం చేయడానికి జలవనరుల శాఖ నుంచి ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించింది. విజయవాడ హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీరు పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు, సూచనలతో కూడిన సమగ్ర నివేదికను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీనిపై ధవళేశ్వరం సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరు ప్రకాశరావుతో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ మాట్లాడగా ఆవ భూమి ముంపు ప్రభావం ఉన్న ప్రాంతమేనని తెలిపారు.
ఇదీ చదవండి
ఆవ భూములపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయరా..?: హైకోర్టు