ఏపీఎస్ఆర్టీసీకి 11వేలకు పైగా బస్సులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 43 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి... 70 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది ఆర్టీసీ. రోజుకు రూ.13 కోట్లు రాబడి వచ్చినా... లెక్కలేస్తే చివరకు నష్టమే మిగిలేది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా మరిన్ని చిక్కులు తెచ్చింది. లాక్డౌన్ వల్ల మార్చి 22 నుంచి రెండు నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆదాయం లేక ఆర్టీసీ ఖజానా ఖాళీ అయింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్యాలయాల నిర్వహణ కూడా భారమైంది.
సగం సీట్లతో.. పరిమిత రూట్లలలో..
రెండు నెలల అనంతరం ఎట్టకేలకు మే 21న బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. పూర్వపు పరిస్థితి వస్తుందని ఆశించిన యాజమాన్యానికి మళ్లీ నిరాశే మిగిలింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవడంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో బస్సులు నడపాల్సివచ్చింది. బస్సుల్లో భౌతిక దూరం పాటించాల్సిందేనన్న ఆదేశాలతో సీట్ల సంఖ్యను సగానికి సగం తగ్గించింది. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించడం సహా కొన్నింటిలో అమరికను మార్చారు. తొలుత 1500 సర్వీసులను రోడ్డెక్కగా... క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 3400 వరకు సర్వీసులు నడుపుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నా..వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బస్సుల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. దీంతో చాలా బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి.
48 శాతానికి పడిపోయిన ఆక్యుపెన్సీ