కృష్ణా నదిలో తమ నీటి వాటాకు తెలంగాణ ఎసరు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ చేపడుతున్న రాజ్యాంగ విరుద్ధ, చట్ట వ్యతిరేక చర్యలతో కృష్ణా జలాల్లో తమకు దక్కాల్సిన సాగు, తాగునీటి వాటాలను కోల్పోతున్నామంటూ సర్వోన్నత న్యాయస్థానానికి మొరపెట్టుకొంది. రాష్ట్ర ప్రజల జీవన, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఈ అంశంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కమిటీ నిర్ణయాలను, కృష్ణా బోర్డు, బచావత్ అవార్డు మార్గదర్శకాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. జల విద్యుదుత్పత్తి కోసం అనధికారంగా 63.12 టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా మేం నీరు తీసుకోకూడదనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడేసిందని ఆరోపించింది. దీని వల్ల 2.30 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయకపోతే తమకు పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణ అక్రమంగా వాడుకున్న నీటిని వారి వాటా 299 టీఎంసీల్లో నుంచి మినహాయించి 2021-22 సంవత్సరానికి కేటాయింపులు జరపాలని కోరింది.
కృష్ణాపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతో పాటు వాటి నుంచి నీటి విడుదల, విద్యుదుత్పత్తి తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) నిర్దేశిత నియమాల ప్రకారం వాటిని నిర్వహించాలని, అవసరమైతే ఆ జలాశయాలకు పోలీసు రక్షణ కల్పించాలని విన్నవించింది.
పిటిషన్‌లోని ప్రధాన అంశాలు..
*2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నా అసాధారణంగా ఏడేళ్లపాటు ఆలస్యమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్ కమిటీ సమావేశమైంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం అంగీకారాన్ని తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని జల్‌శక్తి మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతో పాటు వాటి నుంచి నీటి విడుదల, విద్యుదుత్పత్తి తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవాలి.
*తమ పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాల్లో వంద శాతం సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ విద్యుత్తు శాఖ జీవో నంబర్ 34ను ఏకపక్షంగా విడుదల చేసింది. విచక్షణారహితమైన ఈ ఉత్తర్వును రద్దు చేయాలి. జల విద్యుదుత్పత్తి కోసం అనధికారంగా 63.12 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ నుంచి 7.54 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. సాగునీటి అవసరాల రీత్యా శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటి విడుదలను ఆపాలి. దీనిపై ఇప్పటికే మేం ప్రధాని, జల్‌శక్తి మంత్రికి ఫిర్యాదు చేశాం.
*శ్రీశైలం నుంచి విద్యుత్తు కోసం తెలంగాణ నీరు విడుదల చేయడం కేడబ్ల్యూడీటీ-1 నిబంధనలు, బచావత్ ట్రైబ్యునల్ నియమాలను ఉల్లంఘించడమే. తెలంగాణ చర్యలతో మా రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడిన ఎస్సార్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టు, నాగార్జునసాగర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ, గుంటూరు ఛానల్, కృష్ణా డెల్టా పరిధిలోని 44.78 లక్షల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చెన్నై నగర తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుంది.
*శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 28.25 టీఎంసీలు, అక్కడి నుంచి పులిచింతలకు 26.18 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి వరద రాకపోతే నాగార్జునసాగర్ ఎండిపోయి ఆయకట్టు రైతులకు అన్యాయం జరగుతుంది.
*విద్యుదుత్పత్తి కోసం పులిచింతల నుంచి 5.36 టీఎంసీల నీరు అక్రమంగా విడుదల చేయడం చట్టవిరుద్ధం.