rains in ap: రాష్ట్రంలో వర్షాల ఉగ్రరూపం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ వర్షాలతో అనంతపురంలో ప్రధాన రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మురుగు కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. రాయదుర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముదిగుబ్బ మండలం యోగివేమన జలాశయం ఏడు గేట్లు తెరిచి... నీటిని విడుదల చేశారు. ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద మద్దిలేరు వాగు ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులను అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. కదిరి కోనేరు పైనుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో.. కదిరి, హిందూపురం, బెంగళూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుక్కపట్నం-ముదిగుబ్బ ప్రధాన రహదారిలోని కుంట్ల ప్రాంతంలో రోడ్లు కోతకు గురయ్యాయి. జిల్లాలో వేల ఎకరాల్లో వేరుశనగ, ఉద్యాన పంటలు నీటమునిగాయి. 11మందిని వాయుసేన..
సీకేపల్లి మండలంలోని చిత్రావతి నదిలో కారు కొట్టుకుపోతుండగా.. స్థానికులు కారులో ప్రయాణిస్తున్న నలుగురిని జేసీబీ సాయంతో రక్షించారు. రక్షించడానికి వెళ్లిన 11 మంది జేసీబీ వాహనంతో సహా ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని.. జిల్లా కలెక్టర్ చొరవతో... వాయుసేన హెలికాప్టర్ సాయంతో రక్షించారు. తాడిమర్రి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 7 గేట్లు తెరిచారు. పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. హిందూపురంలోని పెన్నా కుముద్వతి ప్రాజెక్టులో ఇద్దరు యువకులు చిక్కుకోవడంతో... స్థానికులు వారిని క్షేమంగా రక్షించారు.
మిద్దెకూలి యువకుడు మృతి...
ఉరవకొండలోని శివరామిరెడ్డి కాలనీ నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు తడిసిపోయాయని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. డోనేకల్, ఉండబండ, వెలిగొండ వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో... రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి మండలం గంతిమర్రిలో వర్షానికి మిద్దె కూలి ఓ యువకుడు మృతిచెందాడు. విడపనకల్లు మండలం పెంచలపాడులో ఓ ఆటో వాగులో చిక్కుకుంది. ఆటోలోని డ్రైవర్‌తో పాటు ఆయన కుటుంబం సురక్షితంగా బయటపడింది.
నెల్లూరు జిల్లాలో పెన్నా ఉగ్రరూపం..
నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పంబలేరు, కెతామన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, అల్లూరు, సంగం వద్ద కొమ్మలేరు, నక్కల వాగు పొంగిపొర్లుతున్నాయి. గూడూరులోని ప్రధాన రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. కావలికి వెళ్లే రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలను పోలీసులు తాడు సాయంతో... రోడ్డు దాటిస్తున్నారు. బాలాయపల్లి మండలం నిండలి దగ్గర కాజ్‌వేపై కైవల్యానది పొంగిపొర్లుతుండటంతో... ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి.
వర్షం ధాటికి కూలిన ఇల్లు..
ప్రకాశం జిల్లాలోనూ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు కూడలి, బాపూజీ కాంప్లెక్స్, పోతురాజు కాలువ, కేశవరాజు కుంటలలో వర్షపు నీరు అధికంగా చేరింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కందుకూరు నుంచి గుడ్లూరుకు వెళ్లే పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆటంకంగా మారింది. ఉప్పుటేరు పొంగి పొర్లుతోంది. రాళ్లపాడు రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. టంగుటూరు, కందుకూరు, జరుగుమిల్లి, లింగసముద్రం, ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భైరవకోన జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కనిగిరి నగర పంచాయతీలోని కాశీపురంలో వర్షం ధాటికి ఓ ఇల్లు కూలింది.
30మంది గల్లంతు.. 12 మృతదేహాలు వెలికితీత
కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలు లభ్యమయ్యాయి.
రహదారులే కాలువల్లా..
కడపలో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రాకుండా ఇసుక బస్తాలు వేసినా... లాభం లేకపోయింది. దాదాపు 250 నివాసాలను ఖాళీ చేయించి... పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి... బంధువుల దగ్గరికి వెళ్లిపోయారు
పులివెందులలో డ్యాములు, చెరువులు, వాగులు, వంకలు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఎర్రగుడిపల్లె, ఇస్లాంపురం, రోటరీపురంలో... ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. చక్రాయపేట మండలం కే.ఎర్రగుడి, బీఎన్.తాండా, గరుగు తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అద్దాలమర్రి క్రాస్ దగ్గర ఉన్న బ్రిడ్జిపై... పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతువంక దగ్గర బ్రిడ్జి తెగిపోయింది.
రైల్వేకోడూరు మండలం బాలపల్లి దగ్గర.... శేషాచలం అడవుల నుంచి ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గుంజన ఏరు ప్రవాహంతో... సమీపంలోని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో తమలపాకులు, అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. ప్రవాహ తీవ్రతతో... రైల్వేకోడూరులో కొన్ని రైళ్లు నిలిపివేశారు.
రాయచోటి పరిధిలోని లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లి, గాలివీడు మండలాల్లో.... వేరుశనగ, వరి, కూరగాయల పంటలు నీటమునిగాయి. మద్దిరేవుల వంకపై నిర్మించిన వంతెన తెగిపోవడం వల్ల... రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రాయచోటి సమీపంలోని కంచాలమ్మ గండిచెరువు, గాలివీడు పెద్దచెరువు అలుగులు ప్రమాదకరస్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
చిన్నమండెం- రాయచోటి - వీరబల్లి మండలాల పరిధిలో మాండవ్య నది ఉగ్రరూపం దాల్చడంతో పొలాలు కోతకు గురయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాయచోటి శివారు ప్రాంతాల్లో... సుమారు 10 ఇళ్లు నేలకూలాయి. కడప- బెంగళూరు- రాజంపేట- రాయచోటి - సుండుపల్లి ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి.
ఇదీ చదవండి:Floods: కడపజిల్లాలో విషాదం.. వరదల్లో గల్లంతై 12 మంది మృతి