ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే..? - tomarrow ap local election notification

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శనివారం ఉదయం... నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. గవర్నర్‌ను కలిసిన ఎస్​ఈసీ.. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా సీఎం జగన్​తో ఏజీ శ్రీరాం, హోంమంత్రి, సజ్జల భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే పంచాయతీరాజ్ శాఖ అధికారులు తర్జనభర్జనల మధ్య ఎస్​ఈసీ కార్యాలయానికి వెళ్లారు. సుప్రీం తీర్పు వెలువరించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని కోరారు. మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఏవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకట్ట వేయడంలో విఫలమైన తొమ్మిది మంది అధికారులను విధుల నుంచి తొలగించాలని సీఎస్​, డీజీపీని కోరారు.

ap local elections 2020
ఏపీ ఎన్నికల నోటిఫికేషన్

By

Published : Jan 22, 2021, 10:07 PM IST

Updated : Jan 23, 2021, 4:55 AM IST

పంచాయతీ ఎన్నికలపై హైడ్రామా..ఇవాళ ఏం జరిగిందంటే..?

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపిన వేళ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సన్నాహాలు వేగవంతం చేశారు. నాలుగుదశల్లో ఎన్నికలు జరపాలని ఇప్పటికే నిర్ణయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం జరిగే మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ వివరాలు వెల్లడించనున్నారు.

ఎన్నికల నిర్వహణ చర‌్యలను ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌... గవర్నర్‌ బిశ్వభూషణ్‌కూ వివరించారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నిమ్మగడ్డ హైకోర్టు తీర్పు దృష్ట్యా ఎన్నికల సంఘానికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకూ ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను.. కోరినట్లు తెలిసింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎన్నికల విధులు అప్పగించడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా.. దౌర్జన్యాలు, దాడులను నివారించడంలో విఫలయ్యారని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 9 మంది అధికారుల పేర్లను సూచిస్తూ.. సీఎస్, డీజీపీకి లేఖ రాశారు.

సీఎంతో పంచాయతీరాజ్ అధికారుల భేటీ...

మరోవైపు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో......ఎస్​ఈసీ రమేశ్ కుమార్ భేటీ కావాల్సి ఉండగా.. అధికారులు హాజరుకాలేదు. వాస్తవానికి ఉదయం 10 గంటలకే సమావేశం జరగాల్సి ఉండగా.. సీఎం జగన్ తమను పిలిచారని, ఆయన్ను కలిసిన తర్వాత సమావేశానికి వస్తామని.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఎస్​ఈసీని కోరారు. నిమ్మగడ్డ అనుమతితో ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినవారు..... పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే మూడు గంటలకు కూడా అధికారులు సమావేశానికి రాకపోవడంతో సాయంత్రం ఐదింటికి రావాలని ఎస్​ఈసీ వారికి మెమో జారీచేశారు.

ఎస్​ఈసీకి లేఖ...

తర్జనభర్జనల మధ్య పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఎసీఈసీ కార్యాలయానికి చేరుకున్నారు. నిమ్మగడ్డ అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత కార్యదర్శిని శ్రీనివాస్​ను కలిసి లేఖను అందజేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దృష్ట్యా నోటిఫికేషన్ వాయిదా వేయాలని కోరారు. కోర్టులో నిర్ణయం వెలువడే వరకు ఆగాలని లేఖలో ప్రస్తావించారు.

ఆదేశాలను పాటించాల్సిందే...

శనివారం పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ తెలిపారు. సీఈసీకి ఉండే అధికారాలే ఎస్‌ఈసీకి ఉంటాయని.. అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ అన్నారు. ఐపీఎస్‌ అధికారికి ప్రత్యేకంగా శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

శనివారం నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తుండగా...మరోవైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఎన్నికల నిర్వహణ అంశం సుప్రీంకు తీర్పు వెలువరించే వరకు ఆగాలాని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్​పై సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు:

Last Updated : Jan 23, 2021, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details