ఏపీజెన్‌కో ఉత్తర్వులు రద్దు
పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతి రద్దు చేస్తూ ఏపీజెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ నవయుగ సంస్థ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన న్యాయస్థానం... ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. నవయుగ సంస్థ అనుమతి రద్దు చేస్తూ ఏపీజెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కొనసాగించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జెన్‌కో ఉత్తర్వులు రద్దు... రివర్స్ టెండరింగ్ వద్దు... మంగళవారం ముగిసిన వాదనలు... నేడు తీర్పు
నవయుగ పిటిషన్ వేసిన పిటిషన్‌పై మంగళవారం వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయస్థానం ఇవాళ వెలువరించింది. నవయుగ సంస్థ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఏ నిబంధన ఉల్లఘించామో తెలపకుండా ఏకపక్షంగా అనుమతి రద్దు చేశారని కోర్టుకు విన్నవించారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తమకు స్థలం కేటాయించాల్సిన బాధ్యత ఏపిజెన్‌కోదేనని ఇప్పటి వరకూ స్థలాన్ని అప్పగించలేదని వివరించారు. పవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు నవంబర్ 2021 వరకూ గడువుందని... పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ప్రాజెక్టు వేరే వ్యక్తులకు ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు.
పిటిషనర్ వాదనకు ఏకీభవించిన కోర్టు
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ అనుమతి పొందిన సదరు సంస్థ నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పనులు జరపటం లేదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అడ్వాన్స్ రూపంలో కొంత నగదు చెల్లించిప్పటికీ పనులు జరగటం లేదని తెలిపారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిలుపుదలపై ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై కొనసాగించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపిజెన్‌కో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసింది.