గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్‌దాస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24న హాజరై విజిలెన్స్ విచారణపై న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. విజిలెన్స్ విచారణ వ్యవహారంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిని ఆదేశించింది. బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తప్పుడు సమాచారమిచ్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన (మెటీరియల్ కాంపొనెంట్) పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి.. అఫిడవిట్ దాఖలు చేస్తూ పిటిషనర్లలో కొంతమందికి పూర్తిగా, మరికొందరికి 79 శాతం చెల్లించామని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో 21 శాతం సొమ్ము చెల్లించకుండా ఆపామన్నారు. కేంద్రం నుంచి తదుపరి విడత నిధులు రాగానే బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కిరణ్ కోర్టుకు తెలిపారు.