ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి.. విద్యుత్ యూనిట్ టారిఫ్ ధరలను పునఃసమీక్షించే విచారణాధికార పరిధి విషయంపై.. హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇతర అంశాలపై విచారణ జరిపేందుకు అప్పీళ్లను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ ఈ ఆర్ సి సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019 లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.
తాజాగా జరిగిన విచారణలో విద్యుత్ పంపిణీ సంస్థల తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపీ ఈఆర్ సికి పునఃసమీక్షించే అధికారం ఉందన్నారు. ఉత్పత్తి సంస్థల తరపున సీనియర్ న్యాయవాదులు వి.శ్రీరఘురాం, సంజయ్ సేన్, బసవ ప్రభుపాటిల్ ప్రతివాదలను వినిపించారు. పీపీఏలను ప్రభుత్వం గౌరవించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. టారిఫ్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి లేదని స్పష్టం చేశారు.