ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుల్హన్‌ ఆపేశామన్నారు కదా.. ఏం జరిగిందో చెప్పండి?: హైకోర్టు

High Court on Dulhan Scheme: దుల్హన్ పథకాన్ని నిలిపివేయడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దుల్హన్ పథకం ఆపేశామన్నారు కదా.. ఏం జరిగిందో చెప్పండి అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

high court on Dulhan scheme
high court on Dulhan scheme

By

Published : Jul 7, 2022, 3:22 PM IST

AP High Court on Dulhan scheme discontinued: దుల్హన్ పథకం అమలును నిలిపివేతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. దుల్హన్ పథకం ఆపేశామన్నారు కదా.. ఏం జరిగిందో చెప్పండి అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. దుల్హన్ పథకంపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు. పథకంపై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పథకం నిలిపివేయటంతో ముస్లిం పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. దుల్హన్ పథకం అమలు నిలిపివేతపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్‌షిబ్లి హైకోర్టులో పిల్​ వేశారు.

దుల్హన్​ పథకంపై ప్రభుత్వం:పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దుల్హన్‌ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లొదిలేసింది. ఈ పథకం అమలుపై ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా, అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలిచ్చిన జగన్‌.. తీరా మూడేళ్లకాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమానికి రూ. 1.60 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం మొదలు, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల వరకు పదేపదే చెబుతూ.. పేద ముస్లిం యువతుల వివాహ సాయానికి వచ్చేసరికి డబ్బుల్లేవంటూ పక్కనపెట్టేశారు. వైకాపా అధికారం చేపట్టాక 2019లో మంత్రివర్గ ఆమోదం తెలిపి.. 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత మరో ఏడాది సమయమివ్వండి.. గొప్పగా సాయం చేస్తామని ప్రకటించి, తాజాగా ఆ ఉత్తర్వులు ఉత్తవే అనేలా మొండిచేయి చూపారు. అప్పటివరకు ముస్లింలకు అందుతున్న రూ. 25 వేల సాయాన్ని 2015లో తెదేపా హయాంలో రూ. 50 వేలకు పెంచారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వివాహాలకు సంబంధించిన పథకాలన్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఆలోచనతో 2018లో దుల్హన్‌ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లకాలంలో దాదాపుగా 50 వేల మందికిపైగా ముస్లింలకు సాయం అందింది. చంద్రన్న పెళ్లికానుక అమల్లోకి వచ్చాక రూ.50 వేల మొత్తంలో పెళ్లి జరిగే సమయంలోనే 20%, మిగతా 80% పెళ్లి అయిన నెల రోజుల్లోనే అందించారు. వైకాపా అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపు చేసి ఇస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌ పలుమార్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి ఏడాది సమయంలో వివాహం చేసుకున్న ముస్లిం జంటల నుంచి దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ వారికి ఒక్క రూపాయి చెల్లించలేదు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details