Construction Works in Amaravati: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న అనంతరం అమరావతి ప్రాంతంలో పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల లాంటి ప్రజాప్రతినిధులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 2017లో ప్రారంభించిన భవనాల సముదాయాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తికావటంతో మిగతా పనులు చేపట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది.
భారీ స్థాయిలోనే వ్యయం..
Building Constructions in Amaravati:3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం అమరావతి మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చింది. దీంతో సీఆర్డీఏ ప్రాంతంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు పరిధిలో నివాసముంటున్న విభాగాధిపతులు, కమిషనర్లు, కార్యదర్శుల హోదాల్లోని అఖిలభారత సర్వీసు అధికారులకు 40 వేల చొప్పున అద్దె భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విభజన అనంతరం ప్రతీ నెలా ఇది ప్రభుత్వానికి భారంగానూ మారింది. ఇప్పటికిప్పుడు భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభించకపోయినా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నిర్మాణాన్నిటికీ భారీ స్థాయిలోనే వ్యయం అయ్యే అవకాశముందని తెలుస్తోంది.