ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP employees: నెలాఖరులోగా పీఆర్‌సీ కొలిక్కి: సజ్జల

ప్రభుత్వ పథకాల అమలు.. ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అడగక ముందే జగన్‌ ప్రభుత్వం ఐఆర్‌ ఇచ్చిందన్న ఆయన.. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

sajjala
sajjala

By

Published : Oct 13, 2021, 2:57 PM IST

Updated : Oct 14, 2021, 4:35 AM IST

ఉద్యోగులకు వేతన సవరణ ఈ నెలాఖరులోగా కొలిక్కి తీసుకొస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నవంబరు చివరిలోగా ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. అక్టోబరు 18, 19 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నవంబరు నుంచి వేతనాలు సక్రమంగా ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు. కొవిడ్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, ఫలితంగానే పీఆర్‌సీ, సీపీఎస్‌ రద్దు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

వచ్చే నెలాఖరులోగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇతర నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. వేతన సవరణ, సీపీఎస్‌ రద్దు తదితర 10 అంశాలపై చర్చించారు. అనంతరం ఐకాస నేతలతో కలిసి సజ్జల విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతున్నాం. గత సీఎస్‌ పదవీ విరమణ చేసిన సమయానికి కొన్ని అంశాలు కొలిక్కి వచ్చినా కొత్త సీఎస్‌ రావడంతో కొంత ఆలస్యం జరిగింది. దీంతో కొన్ని చిన్న సమస్యలు పెద్దగా కనిపించాయి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో రెండు అడుగులు ముందుండాలన్నదే సీఎం విధానం’ అని చెప్పారు. ‘ఉద్యోగులేమైనా బయటి వ్యక్తులా..? వాళ్లు ఏదైనా ఆందోళన చేస్తున్నప్పుడు సమస్య ఏమిటని అడగడం సాధారణం. ఉద్యోగుల సమస్యలపై అధికారికంగా.. అనధికారికంగా ఫోన్లలో మాట్లాడుతుంటారు. అంతర్జాతీయ రహస్యమైనట్లు వింతగా మాట్లాడుతున్నారు. బండి శ్రీనివాసరావు అక్కడే ప్రెస్‌మీట్‌లోనే ఫోన్లో ఎందుకు మాట్లాడతారు..? పక్కకు వెళ్లి మాట్లాడలేరా..? ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తుంది. సీఎస్‌తో సమావేశానికి అందరూ రావొచ్చు. ఉద్యోగుల్ని గ్రూపులుగా విడగొట్టి రాజకీయం చేయాలన్నది సీఎం ఉద్దేశం కాదు’ అని సజ్జల స్పష్టం చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పరిష్కరించకుంటే ఉద్యమమే: ఐకాస నేతలు

వచ్చే నెలాఖరులోగా సమస్యలన్నీ కొలిక్కి తీసుకొస్తామని సజ్జల హామీ ఇచ్చారని, ఒకవేళ పరిష్కారమవకుంటే ఉద్యమ బాట వదిలిపెట్టబోమని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ‘దసరా కానుకగా పీఆర్‌సీ ఇవ్వాలని కోరగా.. చర్చించాల్సి ఉందని.. సీఎస్‌కు బుధవారం నుంచే ఇందుకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులుంటే ముందుగా రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చి ఆ తర్వాతే వేతనాలు ఇవ్వాలని కోరాం. కారుణ్య నియామకాల కోసం ప్రత్యేక మేళాలు నిర్వహించాలి. పెండింగ్‌ బిల్లులు, పీపీ జీఎల్‌ఐ, జీపీఎఫ్‌, మెడికల్‌ బిల్లుల విడుదలపై త్వరలో ఆర్థిక శాఖతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యకార్డులు సక్రమంగా పనిచేయనందున నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు’ అని వివరించారు. సమావేశంలో ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి వైవీ రావు, ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తదితరులున్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులు

మధ్యంతర భృతితో సమంగా..

పీఆర్సీ నివేదిక అమలుచేసే లోపు ప్రభుత్వాలు ఉద్యోగులకు ఐఆర్‌ (మధ్యంతర భృతి) ఇస్తాయి. 2019 జులై నుంచి ప్రభుత్వం 27% మధ్యంతర భృతి ఇస్తోంది. వేతన సవరణ కమిషన్‌ కూడా అంతే మొత్తంలో ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేసిందని తెలిసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన స్కేళ్లు పెంచేందుకు ఈ ఫిట్‌మెంట్‌ను లెక్కకట్టి వేతన సవరణ కమిషన్‌ సిఫార్సు చేస్తుంది. ఇంటి అద్దె భత్యం, గ్రాట్యుటీ పెంపు, ప్రారంభ మూలవేతనం తదితరాలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నందువల్ల వారి విషయంలోనూ ప్రత్యేక నివేదికను కమిషన్‌ సమర్పించింది.

పీఆర్‌సీ నివేదికలో 27% ఫిట్‌మెంట్‌?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్‌ 27% ఫిట్‌మెంటును సిఫార్సు చేసిందా? అది అంతే మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికను అమలు చేయాల్సి ఉంది. అశుతోష్‌ మిశ్ర ఏకసభ్య ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్‌ గతేడాది అక్టోబరు 5న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వేతన సవరణ కమిషన్‌ నివేదిక సమర్పణ ఎంతో హడావుడిగా జరుగుతుంది. ముఖ్యమంత్రికి నేరుగా కమిషన్‌ తన నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వారు విలేకర్లతోనూ మాట్లాడతారు. ఈ కమిషన్‌ కరోనా సమయంలో నివేదిక సమర్పించాల్సి వచ్చింది. దీంతో ఛైర్మన్‌ అశుతోష్‌ మిశ్ర రాకుండానే నివేదికను వారి కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆ నివేదిక అందింది. ఇంతవరకూ ప్రభుత్వం నివేదికను బయటపెట్టలేదు. సాధారణంగా ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్‌ ఇస్తారనేది ఆసక్తికరం. వీలైనంత ఎక్కువ మొత్తం సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయి.

ఇదీ చదవండి:

new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

Last Updated : Oct 14, 2021, 4:35 AM IST

ABOUT THE AUTHOR

...view details