ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Cases Withdrawal matter on YSRCP Leaders: వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కితగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కోసం ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని న్యాయవాది తెలిపారు. విచారణను హైకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది.

cases matter on YSRCP Leaders
వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ

By

Published : Sep 20, 2022, 8:29 AM IST

Cases Withdrawal matter on YSRCP Leaders: వైకాపా ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరించేందుకు జీవోలు జారీచేసి రాష్ట్ర ప్రభుత్వం ‘డేంజర్‌ జోన్‌’లో ఉందని హైకోర్టు గత విచారణలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు గతంలో ఇచ్చిన తొమ్మిది జీవోలను ఉపసంహరించుకుంటూ తాజాగా జీవో ఇచ్చామన్నారు. ఆ వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచుతామన్నారు. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని కోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్‌ 16 నుంచి 2021 ఆగస్టు 25లోపు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఎన్నికేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. వైకాపాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ఆమోదం తెలపాలని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ వ్యాజ్యాలన్ని సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.

ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఫిర్యాదుదారుడు వాదనను వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకు నోటీసులు జారీచేద్దామని వెల్లడించింది. కేసు ఉపసంహరణ విషయం నిందితులు, హైకోర్టు మధ్య వ్యవహారం కాదంది. కేసు తీవ్రత, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపసంహరణకు అర్హమైందా కాదా పరిశీలిస్తామని చెప్పింది. అంతిమంగా కేసు ఉపసంహరణకు అనుమతిచ్చేది దిగువ కోర్టులేనని స్పష్టంచేసింది.

9 జీవోలు ఎవరికి సంబంధించినవంటే..:
1. చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే విడదల రజనీ, 2019లో చిలకలూరిపేట పట్టణ పోలీసుస్టేషన్, ఐపీసీ సెక్షన్‌ 188. ప్రస్తుతం విజయవాడలోని ఎంపీఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు. జీవో 1023, తేది 21.10.2020
2. ఎంపీ మిథున్‌రెడ్డి, రాజంపేట, సీహెచ్‌ ద్వారకారెడ్డి, మరో ఇద్దరు, 2009లో సదుం ఠాణా, చిత్తూరు జిల్లా, ఐపీసీ సెక్షన్‌ 188, 341, 427, 323, 324 రెడ్‌ విత్‌ 34, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 131. 188. ప్రస్తుతం విజయవాడలోని ఎంపీఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు. జీవో 85 తేది 2021 జనవరి 28.
3. విరూపాక్షి జయచంద్రారెడ్డి, మరో 18 మంది. 2015లో యార్పేడు ఠాణా, తిరుపతి. ఐపీసీ సెక్షన్‌ 448, 323, 354. జీవో 88. తేది 2021 జనవరి 28.
4. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 2019లో అజిత్‌సింగ్‌నగర్‌ ఠాణా, విజయవాడ. ఐపీసీ సెక్షన్‌ 143, 188 రెడ్‌విత్‌ 149. జీవో 373, తేది 2021 ఏప్రిల్‌ 08.
5.వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ. 2014లో పొదిలి ఠాణా, ఐపీసీ సెక్షన్‌ 188, 283, 143. సెక్షన్‌ 32 పోలీస్‌ చట్టం. ఒంగోలు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు. జీవో 487, తేది 2021 మే 19.
6.జగయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. నందిగామ ఠాణాలో 2017, 2018లో నమోదు అయిన రెండు కేసులు, 2015, 2017, 2018, జగయ్యపేట ఠాణాలో నాలుగు కేసులు, 2018లో వత్సవాయి ఠాణాలో రెండు, 2017, 2019లో చిల్లకల్లు ఠాణాలో రెండు కేసులు. మొత్తం పది కేసులు. జీవో 502, తేది 2021 మే 28.
7. ఆళ్లగడ్డ వైకాపా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి. ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసు స్టేషన్‌. 2019లో నమోదు అయిన కేసు. ఐపీసీ 143, 147, 148, 324, 326, 332, 333, 353, 307, 188. పోలీసు యాక్ట్‌ సెక్షన్‌ 32. ప్రజా ఆస్తుల ద్వంస నిరోధక చట్టం సెక్షన్‌ 3. జీవో 550, తేది 2021 జూన్‌ 16.
8. తూర్పుగోదావరి రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజమహేంద్రవరం మూడో పట్టణ ఠాణాలో ఐపీసీ సెక్షన్‌ 143, 341, 189, 290, 506. 2015లో నమోదు అయిన కేసు. రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌ ఠాణాలో 2016లో నమోదు అయిన మరో కేసు. జీవో 594, తేది 2021 జూన్‌ 30.
9. కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప్‌ అప్పారావు. నూజివీడు పట్టణ ఠాణా. 2018లో నమోదు అయిన కేసు. ఐపీసీ సెక్షన్‌ 341, 143, రెడ్‌విత్‌ 149. జీవో 1111 తేది 2020 నవంబర్‌ 10.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details