ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు - AP CORONA CASES NEWS UPDATES

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. 145 మంది కరోనా బారి నుంచి బయటపడగా...ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు.

ap-corona-cases
ap-corona-cases

By

Published : Apr 24, 2020, 1:04 PM IST

Updated : Apr 24, 2020, 7:01 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఒకేరోజు 27 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 14, గుంటూరులో 11 కేసులు బయటపడ్డాయి. అనంతపురంలో 4, ప్రకాశంలో 3, తూర్పుగోదావరిలో 2, నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురం, కర్నూలులో ఒకరు చొప్పున రెండు మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 6 వేల 306 నమూనాలు పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్నూలు జిల్లాలో కరోనా అంతకంతకూ పడగ విప్పుతోంది. రోజురోజుకూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన 27 కేసులతో కలిపి ఇప్పటివరకూ 261 కేసులు నమోదయ్యాయి. వీరిలో 249 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 8 మంది మరణించగా... నలుగురు డిశ్చార్జి అయ్యారు.

మొత్తం కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్నా కేసుల నమోదు తగ్గలేదు. కొత్తగా 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనివల్ల మొత్తం కేసుల సంఖ్య 206కు చేరింది. వీరిలో 8 మంది మరణించగా... 23 మంది డిశ్చార్జి అయ్యారు. 175 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరింది. 25 మంది డిశ్చార్జి అయ్యారు. 70 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు ముమ్మరం చేసిన జిల్లా యంత్రాంగం... మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతోంది.

అనంతపురంలో 4 కొత్త కేసులు నమోదు కావటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 46కు పెరిగింది. వీరిలో ఇప్పటివరకు నలుగురు మరణించగా... 11 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 31 మందికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రకాశంలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో కేసుల సంఖ్య 53కు పెరిగింది. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జి కాగా... 51 మందికి చికిత్స అందుతోంది. నెల్లూరు జిల్లాలో నమోదైన ఓ పాజిటివ్‌ కేసు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అని, ఆయనకు నెల్లూరు ఆసుపత్రిలోనే చికిత్స అందుతున్నప్పటికీ... కేసును మాత్రం ప్రకాశం జిల్లాలోనే చేరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తూర్పుగోదావరిలో 2 కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 34 కు చేరింది. రాజమహేంద్రవరం, సామర్లకోటలో ఒక్కోకేసు చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. వీరికి గతంలో నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతం 26 మందికి వైద్యం అందిస్తున్నారు.

కడప, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ పాజిటివ్‌ కేసులు రాలేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 24, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details