రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 821కు చేరింది. బుధవారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదవగా గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతలో ఒకరు కరోనాతో కన్నుమూశారు. కర్నూలు జిల్లాలో వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. బుధవారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 19 మందికి వ్యాధి నిర్థరణకావడంతో జిల్లాలో బాధితుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో నాల్గో వంతు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల నుంచి 96 మందిని డిశ్చార్జి చేశారు. నందికొట్కూరులో ఒకేసారి 4 కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాలలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున అన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఓ సచివాలయ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో వార్డు ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ హరినారాయణతో పాటు, ఏపీఎన్ఆర్టీ సీఈవో శ్రీనివాసరావును కోవిడ్ ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులు
ఇక గుంటూరు జిల్లాలోనూ కరోనా విస్తరిస్తోంది. బుధవారం నిర్థరించిన 19 పాజిటివ్ కేసులతో కలిపి బాధితుల సంఖ్య 177కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలో మరోసారి కేసుల తాకిడి కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 380 కరోనా కేసులు నమోదవగా ఇది రాష్ట్ర వాటాలో 46.74 శాతమని అధికారులు తెలిపారు. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రి నుంచి 8మంది డిశ్చార్చి అయ్యారు. గన్నవరంలో నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వంద వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... జరిమానా చెల్లించి లాక్‌డౌన్ అనంతరం వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా స్పష్టంచేశారు. చిత్తూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 59కు చేరింది. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదవగా.. అవన్నీ శ్రీకాళహస్తిలోనే బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులున్నాయి.