సీఎం జగన్ సతీమణి భార్య భారతిపై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ.. ఐటీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజయ్ నివాసానికి వచ్చిన పోలీసులు.. బ్యాంకు అధికారులమంటూ హడావుడి చేసి అనధికారికంగా ఇంట్లో సోదాలు చేశారని మండిపడ్డారు. పోలీసులు తనని కొట్టడమేగాక.. విజయ్ ఐదేళ్ల కుమార్తెను బెదిరించారని ఆయన వ్యక్తిగత సహాయకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వేళ్లారు. ఈనెల 6న మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకాకుంటే...అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు .
విజయ్‌ను పట్టుకుని తమతో తీసుకెళ్లేందుకే వచ్చిన సీఐడీ పోలీసులు.. ముందురోజే ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయమే రెండు కార్లలో వచ్చిన 14 మంది సీఐడీ పోలీసులు.. వాహనాలు దూరంగా నిలిపివేసి పరిసరాలను పరిశీలించి వెళ్లారు. శనివారం ఉదయం ఒక్కసారిగా 14,15 మంది ఇంట్లోకి ప్రవేశించటంతో విజయ్ కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సెల్లార్‌లో ఉన్న విజయ్ వ్యక్తిగత సహాయకుణ్ని బెదిరించారు. చెంప మీద కొట్టి తాము బ్యాంకు అధికారులమంటూ ఇంటి తలుపులు తెరిపించారు. పడకగది, వంటగది, అల్మరాల్లో తనిఖీలు చేశారని, ఇంట్లో పిల్లలు, మహిళలున్నా చూడకుండా హల్‌చల్ చేశారని, అసలు వచ్చింది పోలీసులా కాదా అనే విషయం తెలియడం లేదని విజయ్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించాలని ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. సాయంత్రం మరోసారి వచ్చి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీశారు. ఫుటేజ్ కావాలంటూ హడావుడి చేశారని తెలిసింది. విజయ్ ఇంట్లోకి సీఐడీ అధికారులు చొరబాటుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు .