'పేద ముస్లిం యువతుల వివాహానికి సాయమందించే దుల్హన్ పథకాన్ని ఒక మంచి రోజు చూసుకుని పునఃప్రారంభిద్దాం. విదేశీ విద్య, విద్యాదీవెన లాంటి పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేద్దాం' అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు తెలిపారు. ఎజెండా అంశాలపై చర్చ ముగిసి, అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని కొనసాగించారు. అప్పుడు, అంతకుముందు అధికారులున్న సమయంలోనూ జరిగిన చర్చల్లోని వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి...
'దుల్హన్'ను వారే ఆపేశారు...దుల్హన్ పథకం చర్చకు వచ్చినప్పుడు సీఎం స్పందిస్తూ... 'ఈ పథకాన్ని 2017, 18లలో వాళ్లే (అప్పటి తెదేపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఆపేశారు. అప్పట్లోనే వేల మందికి పెండింగ్ పెట్టారు. అవి క్లియర్ చేసి, కొత్తగా మనం కొనసాగించాలంటే నిధులుండాలి కదా? మనమే ఆపేసినట్లు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు (తెదేపా) పెండింగులో పెట్టినవాటికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? పథకాన్ని కొనసాగించేందుకు ఎంత ఖర్చవుతుందనే అంచనా సిద్ధం అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని పథకాన్ని పునఃప్రారంభిద్దాం' అని చెప్పినట్లు తెలిసింది.
విద్యాదీవెనపైనా అదే తీరు...విద్యాదీవెనపై హైకోర్టులో జరుగుతున్న విచారణ అంశంపైనా చర్చించారు. 'ఆ పథకంలో సుమారు నాలుగైదు వందల మంది విద్యార్థులు వీసా తిరస్కరణకు గురై, విదేశాలకు వెళ్లకపోయినా... వెళ్లినట్లుగా వారికి విదేశీ విద్య పథకం కింద సాయం అందించినట్లుగా తెదేపా ప్రభుత్వంలో చూపించారు' అని ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ 'అవన్నీ చూడాలి కదా? ఏదో కొద్ది మందికి ఇలా పథకాలు ఇవ్వడమనేది మన ఉద్దేశం కాదు. విదేశీ విద్య అయినా, విద్యాదీవెనలాంటి పథకాలైనా శాచురేషన్ పద్ధతిలో అమల్జేద్దాం. ఆ పథకాలన్నింటికీ వాళ్లు (తెదేపా ప్రభుత్వం) ఎంత పెండింగ్ పెట్టారో లెక్కలు తీసి, ఇప్పుడు కొనసాగించేందుకు ఎంతవుతుందనేది అంచనా వేసి, నిధులు ఎలా సమీకరించగలమనేదీ చూసుకుని ఒక సమగ్ర ప్రణాళికతో వెళదాం' అని చెప్పినట్లు సమాచారం.
రైతులు కాని వారికీ ఇచ్చేశారు...తిత్లీ తుపాను బాధితులకు అదనపు పరిహారం ఇచ్చేందుకు జారీ చేసిన జీఓను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో... తెదేపా హయాంలో 14,135 మంది రైతులు కాని వారికి, ఇతరులకు తిత్లీ పరిహారం ఇచ్చేశారనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ పరిహారం రికవరీకి, మొత్తం వ్యవహారంపై విచారణకు ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. దీనిపై కొంత చర్చ తర్వాత ప్రస్తుతానికి విచారణకు ఆదేశించాలని, బాధ్యులెవరో తేలాక దాన్నిబట్టి రికవరీ, ఇతర చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం.