ఈ మండలి మనకు అవసరమా..?: సీఎం జగన్ శాసనసభకు సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి... రాజకీయ అజెండాతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి మండలి మనకు అవసరమా అని ప్రశ్నించారు. శాసనసభలో ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసమండలిలో ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపించిన తరుణంలో... మండలి వ్యవహారాలపై ఇవాళ శాసనసభలో చర్చ జరిగింది.
మండలి పరిణామాలతో...
ప్రణాళిక వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభ సోమవారం ఆమోదించింది. ఆ తర్వాత ఈ బిల్లులను మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. తమకు మెజార్టీ ఉన్న శాసనమండలిలో ఈ బిల్లులను అడ్డుకునేందుకు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఆర్టికల్ 71 కింద ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని... దానిపై చర్చ చేపట్టాలని తెదేపా కోరింది. బిల్లులపై చర్చించాలని మంత్రులు పట్టుబట్టారు. మంగళ, బుధవారాల్లో మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్యలోనే బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ నిర్ణయం ప్రకటించారు.
ఈ పరిణామంతో కంగుతిన్న అధికారపక్షం ఇవాళ శాసనసభలో దీనిపై చర్చ చేపట్టింది. చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్... ప్రజల చేత ఎన్నుకున్న శాసనసభ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏటా రూ.60 కోట్లు మండలి కోసం ఖర్చు చేస్తున్నామని... అయినప్పటికీ శాసనమండలి తన పాత్రను సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు. పెద్దల సభగా తమకు సలహాలు ఇవ్వాల్సిన మండలి... రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకుంటోందని ఆరోపించారు.
శాసనసభలో ఆమోదం పొందిన రెండు బిల్లులను బుధవారం మండలి అడ్డుకుందని, మండలి ఛైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఎం జగన్ చెప్పారు. ఛైర్మన్గా తనకున్న విచక్షణాధికారాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభనే అడ్డగించే విధంగా ఉన్న మండలి కొనసాగించడంపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
నిర్ణయం సోమవారానికి...
శాసససభలో మండలిపై సుదీర్ఘ చర్చ జరగడంతో... మండలి రద్దు దిశగా నిర్ణయం వెలువడుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం సైతం ఆ దిశగానే సాగింది. అయితే దీనిపై మరింత వివరంగా చర్చిద్దామని సీఎం జగన్ అన్నారు. సోమవారం మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆ తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది.